సర్కారుపై సమరశంఖం | - | Sakshi
Sakshi News home page

సర్కారుపై సమరశంఖం

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

సాక్షి, అమలాపురం: ఏదో ఒక విధంగా అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు అండ్‌ కో.. గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాలను షరా మామూలుగా తుంగలో తొక్కేశారు. చంద్రబాబు చెప్పిన ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటి మాటలు నమ్మి తాము మోసపోయామని నిరుద్యోగులు, విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగునా దగా చేసిన సర్కారుపై వారు పిడికిలి బిగిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

అడుగడుగునా దగా

● నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు గొప్పగా డప్పేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా భృతిపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో సుమారు 10 వేల మంది నిరుద్యోగులు భృతికి అర్హులుగా ఉన్నారని అంచనా. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున లెక్కిస్తే ఏడాదికి రూ.3 కోట్లు అవుతుంది. రెండేళ్లకు కలిపి రూ.6 కోట్ల మేర నిరుద్యోగులకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాగా, జిల్లాలో 4.50 లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా నిరుద్యోగిగా ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 4.50 లక్షలకు పైగా నిరుద్యోగులున్నట్లు అనధికార అంచనా. ఆవిధంగా లెక్కిస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి ఏడాదికి రూ.135 కోట్లు పైగా ఉంటుంది. దీని ప్రకారం జిల్లాలోని నిరుద్యోగులకు ప్రభుత్వం రెండేళ్లకు కలిపి రూ.270 కోట్లకు పైగా నిరుద్యోగ భృతి బకాయి పడింది.

● ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల (ఎండీయూ) వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. తద్వారా జిల్లాలోని సుమారు 1,065 మంది యువతను రోడ్డున పడేసింది.

● జిల్లాలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే అమరావతి, అడపాదడపా విశాఖకు తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. మరోవైపు స్థానికంగా ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూత పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

● జిల్లాలో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.17 కోట్లకు చేరాయి. ఈ ఏడాది సుమారు 27 వేల నుంచి 32 వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో సొమ్ము పడకపోవడంతో ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో క్వార్టర్‌కు రూ.15 వేల వరకూ రావాల్సి ఉండగా, కొందరు విద్యార్థులకు నాలుగు నుంచి ఏడు క్వార్టర్ల వరకూ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఒక్కో విద్యార్థికి రూ.60 వేల నుంచి రూ.1.05 లక్షల వరకూ రావాల్సి ఉంది.

● 2025–26 విద్యా సంవత్సరానికి ఇంకా ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఐటీఐల్లో అడ్మిషన్లు పూర్తి కాలేదని, అందుకే తొలి క్వార్టర్‌ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బకాయిలపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడం గమనార్హం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆర్‌టీఎఫ్‌ నిధులు తక్షణమే విడుదల చేయాలనే డిమాండుతో జిల్లాలోని 49 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు గతంలో ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదు.

వెనుక దగా ముందు దగా.. కుడి ఎడమల దగా దగా అంటూ మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో

అక్షరీకరించిన ‘చేదుపాట’.. చంద్రబాబు

ప్రభుత్వంలో అక్షర సత్యంగా నిలుస్తోంది.

నేటి నిరసన ఇలా..

యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన మంగళవారం ఉదయం 9 గంటలకు అమలాపురంలో నిరసన ప్రదర్శన జరగనుంది. స్థానిక నల్లవంతెన వద్ద నుంచి కలెక్టరేట్‌ వరకూ పాదయాత్రగా ఈ ప్రదర్శన సాగుతుంది. డీఎస్సీ అక్రమాలపై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచీ పార్టీ, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.

విజయవంతం చేయాలి

చంద్రబాబు ప్రభుత్వ దగాకోరు విధానాలతో రాష్ట్రంలోని యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అమలాపురం నల్ల వంతెన వద్ద వంటెద్దు వెంకన్నాయుడు కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ ఈ ర్యాలీ జరుగుతుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలి. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీని నిరసిస్తూ లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ వేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోనూ డీఎస్సీ పేపర్‌ లీకై ంది. స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు జరిగాయి. టాప్‌ ర్యాంకర్లను చివరిలో పెట్టారు. తద్వారా అర్హులకు అన్యాయం జరిగింది. దీనిపై సీబీఐ విచారణ చేయడంతో పాటు, దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంటు, నిరుద్యోగ భృతి, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా యువత, విద్యార్థుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

– చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే

పిడికిలి బిగిస్తున్న

నిరుద్యోగులు, విద్యార్థులు

నేడు అమలాపురంలో

భారీ నిరసన ప్రదర్శన

విజయవంతం చేయాలని

వైఎస్సార్‌ సీపీ నేతల పిలుపు

డీఎస్సీలో అక్రమాలతో అన్యాయం

చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో భారీ అవకతవకలు వెలుగు చూశాయి. మెరిట్‌ ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నష్టపోయిన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల రాజీనామా చేసినట్లుగానే.. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్‌ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్‌ జోరందుకుంది. యువత, విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement