ముంపు సమస్యకు తాత్కాలిక పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ముంపు సమస్యకు తాత్కాలిక పరిష్కారం

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

ఆత్రేయపురం: లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం గ్రామాల్లో పంట పొలాల ముంపు సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. ముంపు బారిన పడిన పంట పొలాలను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ నెల 20న పరిశీలించి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావుతో కలసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తక్షణం ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జగ్గిరెడ్డి ఆ సందర్భంగా హెచ్చరించారు. దీంతో కూటమి ప్రభుత్వం దిగి వచ్చింది. ముంపులో ఉన్న పంట పొలాలను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైదియాదేవి, ఇరిగేషన్‌, డ్రైనేజీ ఈఈలు వెంకటేశ్వరరావు, కిషోర్‌ తదితరులు ఈ నెల 22న స్వయంగా పరిశీలించారు. ముంపునకు గల కారణాలను డ్రైనేజీ ఉన్నతాధికారిని అడిగి కలెక్టర్‌ తెలుసుకున్నారు. జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, ఒకవైపు శివారు భూములకు సాగునీరు అందడం లేదని, మరోవైపు ఆత్రేయపురం, వాడపల్లి, లొల్ల గ్రామాల్లో వరి పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అమలాపురం బ్యాంకు కాలువకు సోమవారం నీటి విడుదలను తగ్గించారు. ముంపు పొలాల్లోని నీటిని బ్యాంకు కాలువలోకి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయానికి చాలా వరకూ ముంపు తగ్గింది. ఈ సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని ఎంపీపీ కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యుడు బోనం సాయిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చిలువూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ కనుమూరి శ్రీనురాజు తదితరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement