బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ –కాకినాడకు అనుబంధంగా ఉన్న 103 కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల నిమిత్తం 84,800 సీట్ల భర్తీకి అనుమతిచ్చారు. అలాగే, జేఎన్‌టీయూకేలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరిన్ని సీట్ల పెంపుదలకు కూడా అనుమతి వచ్చింది. సీఎస్‌ఈ, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ వంటి విభాగాల్లో ఇప్పటి వరకూ ఒక్కో దానికి ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 55 సీట్లు మాత్రమే ఉండేవి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నుంచి కొత్తగా వచ్చిన అనుమతితో ఒక్కో సెక్షన్‌కు 60, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6 కలిపి మొత్తం 66 సీట్లు ఇచ్చారు. ఒక్కో కోర్సుకు రెండు సెక్షన్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.
ఉన్నత విద్యా మండలికి నివేదిక
రాష్ట్రంలోని అన్ని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యా మండలికి నివేదిస్తేనే అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో కళాశాలల వివరాలు విద్యార్థులకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధిక అనుబంధ కళాశాలలు కలిగి ఉండటంతో పాటు సాంకేతిక విద్యలో కీలకంగా ఉన్న జేఎన్‌టీయూకే ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఉన్నత విద్యా మండలికి నివేదిక పంపించింది. ఈ నెల 21 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా.. కళాశాల, కోర్సు ఎంపికకు కీలకమైన వెబ్ ఆప్షన్లకు ఈ నెల 31 వరకూ అవకాశముంది. ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలున్న కళాశాలలకే గుర్తింపు ఇచ్చామని జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. అటువంటి కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. జేఎన్‌టీయూ–కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది అన్ని విభాగాల్లో సీట్లు పెంచి కొత్తగా మరో సెక్షన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపాల్ కొప్పిరెడ్డి పద్మరాజు తెలిపారు. దీంతో, మరింత మంది విద్యార్థులకు కళాశాలలో చేరే అవకాశం లభిస్తుందని, ర్యాంకు ఆధారంగా అర్హులైన వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.


