మలికిపురం: కొంగుముడులు వేసుకుని.. కొత్త జీవితం ప్రారంభించిన వేళ.. చేసిన ప్రమాణాలను ఆ దంపతులు కడవరకూ గుర్తు పెట్టుకునే పయనించారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడంతో మొదలైన వారి జీవిత ప్రయాణం.. చివరి అడుగు వరకూ కలిసే సాగింది. ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తోడుగా నిలిచిన వారు.. వీడని నీడలా.. ఒకరి వెంట మరొకరంటూ కలిసే వెళ్లిపోయారు. భర్త తుదిశ్వాస విడిచిన రెండు రోజుల్లోనే భార్య కూడా మరణించిన సంఘటన మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన కానేటి తాతారావు (87), ఝాన్సీలక్ష్మి (74) భార్యాభర్తలు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తాతారావు అండమాన్ – నికోబార్ దీవుల్లో పౌర సరఫరాల శాఖ అధికారిగా పని చేసి రిటైరయ్యారు. సుమారు 20 ఏళ్ల కిందట సొంతూరికి వచ్చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు డాక్టర్ రామ్మోహన్ హైదరాబాద్‌లో వైద్య వృత్తిలో ఉన్నారు. కుమార్తె శైలజ, చిన్న కుమారుడు రవికుమార్ అండమాన్‌లోనే ఉంటున్నారు. తాతారావుకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగుండటం లేదు. దీంతో, ఆయనను చూసేందుకు పెద్ద కుమారుడు డాక్టర్ రామ్మోహన్ దంపతులు, కుమార్తె శైలజ దంపతులు ఇటీవల విశ్వేశ్వరాయపురం వచ్చారు. వారి సమక్షంలోనే తాతారావు ఈ నెల 24న గుండెపోటుతో మృతి చెందారు. అండమాన్‌లో ఉన్న చిన్న కుమారుడు రవికుమార్ రాక కోసం తాతారావు మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉంచారు. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే ఉదయం 10.30 గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో తాతారావు భార్య ఝాన్సీలక్ష్మి ప్రాణాలు విడిచిపెట్టారు. ఎన్నో ఏళ్లుగా జీవన సహచరుడిగా ఉన్న భర్త మరణాన్ని భరించలేక ఆమె కూడా చనిపోవడంతో అందరూ పెద్ద పెట్టున విలపించారు. కుటుంబ సభ్యు లు గుండె దిటవు చేసుకుని, దంపతులిద్దరి అంత్యక్రియలనూ కన్నీటి వేదన నడుమ ఒకేసారి నిర్వహించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే.. అందునా భర్త మృతదేహం ఉండగానే భార్య మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఫ 24న గుండెపోటుతో భర్త మృతి
ఫ ఆయన వెనుకే తిరిగిరాని
లోకాలకు వెళ్లిపోయిన భార్య
ఫ విశ్వేశ్వరాయపురంలో విషాదం


