● కాలిపోయిన మూడు టీ పాయింట్లు
● మరో హోటల్‌కు పాక్షికంగా నష్టం
దేవరపల్లి: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేలోని దేవరపల్లి జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు (టీ పాయింట్లు) పూర్తిగా కాలిపోగా, ఓ హోటల్ పాక్షికంగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టీ పాయింట్లో ఉద యం ఐదు గంటల సమయంలో టీ కాస్తుండగా మంటలు వ్యాపించాయి. అవి పక్కనే గల మరో రెండు దు కాణాలకు పాకి మూడు కాలిబూడిదయ్యాయి. వీటికి అనుకుని ఉన్న ఓ హోటల్ పాక్షికంగా దెబ్బతింది. మంటలకు దుకాణాల్లోని వంట గ్యాస్ సిలిండర్లు పేల డంతో పరిసర ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గోపాలపురం మండలం పెద్దాపురం, గోపాలపురానికి చెందిన పిల్లి లక్ష్మణరావు, దాసి చందు, కందుల రామకృష్ణ ఈ దుకాణాలను అద్దెకు తీసుకుని టీ పాయింట్లు ఏర్పాటు చేశారు. అప్పులు చేసి వీటిని నిర్వహిస్తున్నామని, ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. మంటలు వ్యాపించిన సమయంలో టీ కాస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.


