ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో
నవనాయక ఫలాలు, సంవత్సరాధిపతి గురించి వివరిస్తూ అధిపతిని బట్టి మిగిలిన గ్రహాలు ఫలితాలిస్తుంటాయని చెప్తారు పండితులు. పాలకుడిని బట్టి యంత్రాంగం వ్యవహరిస్తుంది. అలా ఉంది పరిస్థితి. చాలా కాలంగా కోనసీమ జిల్లాలో కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్టు తయారైంది పరిస్థితి. అన్ని రంగాలు దాదాపు పడకేసి అటు వ్యాపారులకు,
ఇటు కొనుగోలుదారులకు ముందడుగు పడనీయడం లేదు. ఒక్కో రంగానిది
ఒక్కో సమస్య. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా అని అన్ని వర్గాలవారూ ఎదురు చూస్తున్నారు.
సాక్షి, అమలాపురం: ఓ వైపు వ్యవసాయం.. మరో వైపు ఉద్యానం.. ఇంకో వైపు ఆక్వా.. వాటితో పాటు నిత్యావసర వస్తువులు, వస్త్రాలు, బంగారం, భవన నిర్మాణ రంగం ఇలా కోనసీమ జిల్లా ఓ పెళ్లింట సందడిలా ఉంటుంది. అటువంటి ఈ జిల్లా నేడు అన్ని రంగాల్లో సంక్షోభంలో చిక్కుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు.
కుదేలైన రియల్ బూమ్
రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం దాదాపు స్తంభించింది. లే అవుట్లలో ప్లాట్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లలో విక్రయాలు దాదాపు పూర్తిగా పడిపోయాయి. భూ, రిజిస్ట్రేషన్ల విలువలు పెరిగి, ఐటీ నిబంధనల ప్రభావంతో ప్లాట్లు, ఫ్లాట్లు ఏళ్ల తరబడి అమ్ముడుపోక వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా జిల్లాలో రిజిస్ట్రేషన్లు 50 శాతానికి పడిపోయాయి.
కళ తప్పిన భవన నిర్మాణాలు
ఇళ్ల రుణాలు లేకపోవడం, నిర్మాణాలు నిలిచిపోవడంతో ఈ రంగం వ్యాపారం 70 శాతానికి పడిపోయింది. సిమెంట్, ఇనుము, ఇసుక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముడిసరుకు ధరలు పెరగడం, మట్టి లభ్యత తగ్గడం, కూలీల కొరతతో బట్టీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరిలో 2,300 ఇటుక బట్టీలు ఉండగా వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మంది ఆధారపడి ఉన్నారు.
అన్ సీజన్‌లో జీడిపప్పు
ఆషాఢం అన్ సీజన్ కావడం.. జీడిగింజల ధరలు ఎక్కువగా ఉండటంతో చిన్న వ్యాపారులు కొనుగోళ్లు చేయడం లేదు. మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉండడంతో టర్నోవర్ 40 శాతం తగ్గింది.
కొబ్బరికి తమిళనాడు సరుకు సెగ
అంబాజీపేట కొబ్బరి మార్కెట్ సంక్షోభంలో ఉంది. స్థానికంగా కొబ్బరి కాయ రూ.15 ఉంటే, తమిళనాడు నుంచి రవాణాతో కలిపి రూ.12.50కే వస్తోంది. దీంతో స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారు. రోజువారీ వ్యాపారం లక్షల్లో ఉండాల్సింది వేల్లోనే ఆగిపోతోంది.
వ్యవసాయం సాగడం లేదు
నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సుమారు 150 కోట్ల వ్యాపారం జరిగే ఎరువులు, పురుగు మందుల విక్రయాలు 60 శాతం పడిపోయాయి. ఆక్వా రంగం సైతం పూర్తిగా స్తంభించిపోయింది.
వెలవెలబోతున్న అమలాపురం వస్త్రాల మార్కెట్ వీధి
ఘోరంగా ఉంది
నిర్మాణ రంగం చాలా ఘోరంగా దెబ్బతింది. క్రయ విక్రయాలు లేక వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అనుకున్న మేర వ్యాపారాలు సాగకపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వ గృహ రుణాల మంజూరులో జాప్యం జరగడంతో పాటు అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి.
– కేవీఆర్ లక్ష్మణ్, శ్రీ శ్రీనివాస
ఎంటర్ ప్రైజెస్, రామచంద్రపురం
రియల్ ఎస్టేట్ స్తంభించింది
రియల్ ఎస్టేట్ రంగం స్తంభించింది. గతంలో ప్లాటు కొందామని వచ్చేవారు ఇప్పుడు రావడం లేదు. బ్యాంకు రుణాలు, పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్లో నమ్మకం లేకపోవడంతో పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయాయి. జిల్లాలో ఆక్వా రంగం దెబ్బతినడం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం చూపుతోంది.
– కొర్లపాటి గోపి, రియల్టర్, అంబాజీపేట
తీవ్రంగా నష్టపోతున్నాం
ఆక్వా రంగం సంక్షోభం వల్ల తమకు వ్యాపారం లేక ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నాం. ఇంజిన్ ఆయిల్, ఇంజన్ స్పేర్ పార్టులు, రేడియేటర్ సామాన్లు అమ్ముతుంటాను. ఈ ఏడాది సగానికి సగం అమ్మకాలు పడిపోయాయి. ఆక్వా సాగు అంతంత మాత్రంగానే జరుగుతుండటంతో వ్యాపారం లేక నష్టాల బారిన పడుతున్నాం.
– ఆర్.మల్లీశ్వరరావు, వ్యాపారి,
మురమళ్ల, ఐ.పోలవరం మండలం
సంక్షోభంలో చిక్కుకుని
ఇటుక పరిశ్రమ సంక్షోభంలో ఉంది. విక్రయాలు లేక గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇటుక తయారీ ఖర్చుకు, విక్రయ ధరకు పొంతన లేకపోయింది. ఇదే క్రమంలో ముడిసరకు కొరత తీవ్రంగా వేధిస్తోంది.
– చల్లా ప్రభాకరరావు,
ఇటుక పరిశ్రమ మండల సమాఖ్య
అధ్యక్షుడు, ఆలమూరు
ఆషాఢం అంతా అన్‌సీజనే
ప్రస్తుత ఆషాఢ మాసంలో జీడిపప్పు వ్యాపారానికి అన్‌సీజన్. ఈ కాలంలో ఎక్కువ రేటులో ఉన్న జీడి గింజలతో వ్యాపారానికి చిన్న వ్యాపారులు చొరవ చూపడం లేదు. అలాగే ఈ కాలంలో మార్కెట్‌లో పప్పుకు డిమాండ్ తక్కువగా ఉంది.
– జక్కంపూడి మాణిక్యాలరావు, జీడిపప్పు వ్యాపారి, మోరి, సఖినేటిపల్లి మండలం
సంక్షోభంలో పచ్చని సీమ
అన్ని రంగాల్లోనూ
స్తంభించిన లావాదేవీలు
ప్రత్యక్షంగా, పరోక్షంగా
25 వేల మందిపై ప్రభావం


