ముంపు నివారణకు తక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

ముంపు నివారణకు తక్షణ చర్యలు

Jul 23 2026 12:36 AM | Updated on Jul 23 2026 12:36 AM

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

ముంపు పొలాల పరిశీలన

ఆత్రేయపురం: లొల్ల గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను కలెక్టర్‌ రావిరాల మహేష్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘అక్కడ అలా.. ఇక్కడ ఇలా..’ కథనానికి ఆయన స్పందించి జేసీ నైదియాదేవి, ఇరిగేషన్‌ ఈఈ వెంకటేశ్వరరావు, డ్రైన్ల విభాగం ఈఈ కిశోర్‌లతో కలసి నీట మునిగిన పొలాలను పరిశీలించారు. సమస్యకు గల కారణాలను డ్రైన్స్‌ ఈఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులు మాట్లాడుతూ రెండు రోజుల పాటు అమలాపురం బ్యాంక్‌ కాలువను లెవెల్‌ మట్టం తగ్గించాలని, శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. ఆ మేరకు కలెక్టర్‌ ఈఈని ఆదేశించారు. తాత్కాలికంగా ముంపు తగ్గించడానికి ఆది, సోమ, మంగళవారాల్లో నీటిమట్టం తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీవో జీవీవీ సత్యనారాయణ, స్థానిక తహసీల్దార్‌ ఆర్‌డీ రామచంద్రమూర్తి, ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన్‌ కరుటూరి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, ముంపు ప్రాంత రైతులు పాల్గొన్నారు.

పూడిక తొలగింపు పరిశీలన

అమలాపురం రూరల్‌: కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, కొత్తపేట ఆర్డీఓతో కలిసి ముక్కామల–ఈదరపల్లి రహదారి పరిధిలోని నడిపూడి వద్ద వంటకాలువలో చేపడుతున్న పూడిక, కలుపు తొలగింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సామాన్యుల ప్రాణాలకు

భద్రత కరువు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం

హత్యకు గురైన సాయి

కుటుంబానికి పరామర్శ

రావులపాలెం: రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేదని బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. రావులపాలెంలోని కొత్తకాలనీలో ఇటీవల హత్యకు గురైన అనే సాయి కుటుంబ సభ్యులను ఆయన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌తో కలసి బుధవారం పరామర్శించి సాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎన్నికల సమయంలో ఎన్నో అబద్దాలు చెప్పి దండాలు పెట్టి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం నేడు దోచుకునే పనిలో బిజీగా ఉందని సురేష్‌ అన్నారు. రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేదని, ఒకవేళ చనిపోతే వారి కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదన్నారు. ఎదురు తిరిగి ఏదైనా అడిగితే కేసులు పెడుతున్నారని, రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తున్నారని అన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్‌, వంగలపూడి బాబూరావు తదితరులు ఉన్నారు.

స్వర్ణాంధ్ర–2047

లక్ష్య సాధనకు కృషి చేయాలి

సాక్షి, అమలాపురం: జిల్లాలో స్వర్ణాంధ్ర–2047 విజన్‌ లక్ష్య సాధనకు జిల్లా, మండల స్థాయి ఆర్థిక పురోభివృద్ధి, ప్రణాళికలు అత్యవసరమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ జీడీడీపీ, జీఎండీపీపై నిర్వహించిన సామార్థ్యాభివృద్ధి – శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక ప్రొఫెసర్‌, ఐదుగురు నిపుణుల బృందం ఈ శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి, విశ్వసనీయ గణాంకాలతో స్వర్ణాంధ్ర–2047 సాధనలో భాగస్వాములు కావాలని అధికారులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ వైఖోమ్‌ నైడియా దేవి, డీఆర్వో వి.సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement