ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన ఆలయంలోని అభివృద్ధి పనులను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రానున్న ఐదేళ్లలో నిత్యం 3 లక్షల వరకు ఐదు లక్షల వరకు భక్తులు దర్శించే అవకాశం ఉన్నందున ఆ మేరకు మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. రానున్న 2, 3 నెలల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో చర్చించి ప్రణాళిక రూపొందించాలన్నారు. తొలుత ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఆలయ ఆవరణలో నిర్మించే ప్రసాదం, వసతి భవనం నిర్మాణానికి సీఎం 12 కోట్లు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈవో నల్లం సూర్య చక్రధరరావు ఆలయ అభివృద్ధిపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ నైడియాదేవి, ఏఎస్పీ మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజుకు
చేరిన లేఖర్ల పెన్‌డౌన్
అమలాపురం టౌన్: రిజిస్ట్రేషన్లలో ప్రైవేటు సేవలను వ్యతిరేకిస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్ నిరసన బుధవారం నాటికి మూడో రోజుకు చేరింది. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దాదాపు రెండు వేల మంది పనులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. దీనివల్ల రూ.కోట్లలో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించాయి. ఈ మేరకు రోజుకు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఈ నెల 1 నుంచి నిరసనలు చేపట్టిన దస్తావేజు లేఖర్లు దశల వారీ ఉద్యమంలో భాగంగా 20వ తేదీ నుంచి 31 వరకూ పెన్ డౌన్ చేపడుతున్నారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజులేఖర్లు బుధవారం మధ్యాహ్నం సహ పంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వద్దకు వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అమలాపురం దస్తావేజులేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి ప్రసాద్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణి ప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, సంయుక్త కార్యదర్శులు పెద్దిరెడ్డి దుర్గేష్, వెలుతురుపల్లి సుబ్బు, సంఘ ప్రతినిధులు గుమ్మడి సురేష్, యల్లమిల్లి సత్యనారాయణ, సిరిపల్లి మూర్తి తదితరులు పెన్ డౌన్ నిరసన చేపడుతున్నారు.
రాష్ట్ర విజిలెన్స్ కమిటీ
సభ్యునిగా అరిగెల
అమలాపురం టౌన్: రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా అంబాజీపేటకు చెందిన కోనసీమ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (కోకో ఫెడ్) చైర్మన్ అరిగెల బలరామమూర్తి నియమితులయ్యారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ చేతుల మీదుగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన ఈ నియామక ఉత్తర్వులను బుధవారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కోకో ఫెడ్, డీసీఐసీ సభ్యుడు బీవీవీ సత్యనారాయణ, పలు వినియోగదారుల సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
రేపు విద్యా సంస్థల బంద్
అమలాపురం టౌన్: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాఽ ద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్ పిలుపునిచ్చారు. అమలాపురంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ నీట్ పేప ర్ లీక్ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 20 మంది వి ద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ తప్పిదం జరిగి దాదాపు మూడు నెలలు గడస్తున్నా ఆత్మహత్యలు చేసుకున్న 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కలిసేందుకు ఇప్పటి వరకూ ప్రయత్నించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోందని అన్నారు.


