పెదపూడి: జి.మామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంపై ఏడు గుర్రాల రథం వద్ద గతంలో ఏర్పాటు చేసిన దాతల శిలాఫలకం, పేర్లు తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ నాయకుడు, ప్రముఖ దాత ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తన అన్నయ్య, దివంగత నేత, మాజీ సర్పంచ్ ద్వారంపూడి అమ్మిరెడ్డి సుమారు 11 బిస్కెట్ల బంగారంతో కేజీ బరువుగల బంగారు కిరీటాన్ని తయారు చేయించి సూర్యనారాయణస్వామి మూల విగ్రహానికి అందజేశారన్నారు. తర్వాత 2016–17లో దేవస్థానానికి సంబంధించిన కమిటీ ప్రతినిధులు గోపురం ఎదురుగా ఏడు గుర్రాల మీద సూర్యనారాయణస్వామి ఉండే విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తనను అడిగారన్నారు. ఆ విగ్రహానికి సుమారు రూ.6.50 లక్షలు ఖర్చయ్యిందని, 2018 జనవరి 24న ప్రారంభించామన్నారు. దానిపై విగ్రహ దాత చింతపండు అమ్మిరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి అని తన పేరు ముద్రించారన్నారు. అయితే ఆ పేర్లను గత సోమవారం రాత్రి స్థానిక టీడీపీ నేత గోపిరెడ్డి మరో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పల్లిపేటలో రూ.5 లక్షల ప్రభుత్వ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారన్నారు. దానికి దాత సూరారెడ్డి రూ.3.50 లక్షలు వెచ్చించారన్నారు. దీంతో ఆ భవనానికి దాత పేరు వేసుకున్నారన్నారు. దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చారన్నారు. మార్కెట్ సమీపంలో స్కూలు ఎప్పటినుంచో ఉందని, దానికి కొన్ని గదులు రెడ్డి బాబు నిర్మించారన్నారు. ఆ స్కూల్ పేరును ఆయన భార్య కాశిరత్నం పేరుగా మార్చేశారన్నారు. అయితే గ్రామ పంచాయతీ, ప్రభుత్వ నిధులతో నిర్మించిన రామాలయం వద్ద కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తండ్రి మూలరెడ్డి పేరు ఎలా పెట్టారు అని ప్రశ్నించారు.
ఫ టీడీపీ నాయకుల చర్యలు దారుణం
ఫ విలేకరులతో ద్వారంపూడి వెంకటరెడ్డి


