సఖినేటిపల్లి: అంతర్వేది ఆలయంలో లక్ష్మీ నృసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పి.రామశేషాచార్యులు, ఎస్‌బీఎం రమేష్ ఈ పూజలు చేశారు. తొలుత వశిష్ట గోదావరి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాల ప్రధాన కలశాలతో విశేష పూజలు చేశారు. వీటితో పాటు పంచామృతాలు, వేదమంత్రాల నడుమ స్వామివారికి విశేష అభిషేకం చేశారు. అలాగే ఆలయంలో విశేష కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఆలయ ఈవో ప్రసాద్ స్వామి వారి దర్శనం, తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నదానాలను పర్యవేక్షించారు. అలాగే నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష పూర్తి చేసిన భక్తులు స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొని, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయ ఈవో ప్రసాద్ అంతరాలయంలో భక్తులకు స్వామివారి ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు.


