సాక్షి, అమలాపురం: కొన్నాళ్లుగా సాగునీరు అందక జిల్లాలోని పలు మండలాల్లో ఖరీఫ్ నారుమళ్లు ఎండిపోతున్నాయి. కాలువల్లో చుక్క నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. శివారుకు నీరు అందించాలంటూ అధికార కూటమి పార్టీల నేతలే రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇంత జరుగుతూంటే స్పందించని అమాత్యుడికి ఇప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చినట్లుంది. కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మోటార్ సైకిల్‌పై శుక్రవారం హడావుడిగా పర్యటించారు. అనంతరం, అమలాపురం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్‌పై ప్రయాణించి కెనాల్ లాకుల వద్ద నీటి నిర్వహణను పర్యవేక్షించానని గొప్పగా చెప్పుకున్నారు. ప్రతి చుక్కా ఒడిసిపట్టి శివారుకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వారికీ ఇప్పుడే మెలకువ
మంత్రి సమీక్షలో ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దేవ వరప్రసాద్, దాట్ల బుచ్చిబాబు, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ఇన్నాళ్లూ ఎమ్మెల్యే పట్టించుకోనేలేదు. అటువంటిది మంత్రిని చూడగానే ఒక్కసారిగా మెలకువ వచ్చినట్టు.. తమతమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు గుర్తుకొచ్చాయి. క్లోజర్ పనుల పేరుతో కోట్ల దోపిడీ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నీరు రావడం లేదంటూ గళమెత్తడం చూసి రైతులు నివ్వెరపోతున్నారు. గత వేసవిలో క్లోజర్ సమయంలో ప్రతి నియోజకవర్గంలో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల పనులు చేస్తున్నామని, చివరి ఆయకట్టుకు నీరందుతోందని అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే, వాస్తవానికి నీటిసంఘాల ముసుగులో తెలుగు తమ్ముళ్లు, కీలక నేతలు ఆ సొమ్ము గరిష్టంగా స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇంత ఖర్చు చేశామని చెప్పిన తరువాత కూడా కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండటంతోనే శివారుకు నీరందడం లేదని రైతులు ఎక్కడికక్కడ గగ్గోలు పెడుతున్నారంటేనే ఈ పనులు ఏవిధంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగానే మధ్య డెల్టాకు 2,800 క్యూసెక్కుల నీరు విడుదల చేసినా అది శివారు ప్రాంతాలకు చేరడం లేదు. మరోవైపు హైవే నిర్మాణంలో భాగంగా చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులతో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడం శోచనీయమని మంత్రే స్వయంగా అంగీకరించారు. కానీ, బాధ్యత తీసుకోవాల్సిన అధికారులను వదిలేసి కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశించారు.
గత ప్రభుత్వంపై బురద జల్లుడు
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో నీటి యాజమాన్య వైఫల్యంపై సమీక్షించాల్సిన మంత్రి.. ఆ విషయం కన్నా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై బురద జల్లడానికే సమయం కేటాయించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ డెల్టాను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
దీనికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు గొంతు కలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా ఇంకా గత ప్రభుత్వం పైనే నెపం వేస్తున్న తీరు చూసి రైతులు విస్తుపోతున్నారు.
నారు ఎండిపోతూనే ఉంది
అమలాపురం మండలం చిందాడగరువులో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి రైతు మట్టా సువర్ణరాజు 10 ప్యాకెట్ల విత్తనాలు కొని 20 రోజుల క్రితం నారుమడి వేశారు. నీరు లేకపోవడంతో నారు పూర్తిగా ఎండి, చచ్చిపోయింది. వేల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని ఆ రైతు ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితే పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఎండిపోయిన నారును వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, పలువురు రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్లే ఇప్పుడు నీటి కొరత వచ్చిందని మంత్రి చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఎప్పుడు పాలించినా రాష్ట్రంలో కరువు కాటకాలు సహజమనే విషయం ప్రజలకు తెలుసన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలంలోనూ కరువు లేదని, ఆ విషయాన్ని మంత్రి ముందు తెలుసుకోవాలని అన్నారు.
ఆద్యంతం సమస్యల వెల్లువ
ఆత్రేయపురం: రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన ఆద్యంతం సమస్యలు వెల్లువెత్తాయి. ఆత్రేయపురం మండలం సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువపై బొబ్బర్లంక హెడ్ లాకుల నుంచి లొల్ల లాకుల వరకూటాయన శుక్రవారం మోటార్ సైకిల్‌పై పర్యటించారు. తొలుత పేరవరం పంపింగ్ స్కీమ్, కాలువను పరిశీలించారు. ఈ స్కీమ్ ద్వారా కూడా సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు చెప్పారు. సెంట్రల్ డెల్టా కాలువను పరిశీలిస్తూ ఉచ్చిలి వద్దకు వచ్చేసరికి అక్కడ పెద్ద సంఖ్యలో రైతులు వేచి ఉన్నారు. ఉచ్చిలి పంపింగ్ స్కీమ్‌ను మూతపడి ఏళ్లు గడుస్తున్నాయని, ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ఉచ్చిలి, ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి, మెర్లపాలెం గ్రామాల్లోని మెరక భూములకు సాగునీరు అందడం లేదని, ఈ స్కీమ్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ సమీపాన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రత్యక్షంగా చూపించారు. డ్రెయిన్లపై నిర్మాణాలు కూలిపోవడం, నీరు వెళ్లకపోవడాన్ని మంత్రి పరిశీలించారు. లొల్ల లాకులను పరిశీలించి, అధ్వానంగా ఉన్నాయని అంగీకరించారు. వీటి పునర్నిర్మాణ పనులను రూ.74 కోట్లు మంజూరు చేసి, త్వరలో ప్రారంభిస్తామని మీడియాకు చెప్పారు. ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి గ్రామాల్లో బ్యాంకు కాలువను ఆనుకుని ఉన్న భూముల ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానిక రైతు నాయకుడు చిలువూరి రామలింగరాజు, లొల్ల గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. సెంట్రాల్ డెల్టాకు సంబంధించి వైడార్ సర్వే నిర్వహిస్తున్నామని, డీపీఆర్ తయారు చేసి, ఆధునీకరణకు చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. పలివెల లాకుల ఆధునీకరణకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. కార్యక్రమాల్లో కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
బొబ్బర్లంక నుంచి మురమళ్ల వరకూ
బైకుపై మంత్రి పర్యటన
నీరున్న కాలువలు, లాకుల పరిశీలన
ఎండిపోయిన నారుమడుల వైపు
కన్నెత్తి కూడా చూడని వైనం


