సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలి

Jul 18 2026 3:35 AM | Updated on Jul 18 2026 3:35 AM

మాజీ ఎంపీ చింతా అనురాధ

అల్లవరం: ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలాపురం నియోజవర్గ వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు సంక్షోభంలో కూరుకుపోతోందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జోన్‌–2 అధ్యక్షురాలు చింతా అనురాధ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరందక వందలాది ఎకరాల్లో నారుమడులు బీటలు వారుతున్నాయని, శివారు ప్రాంతాల్లో నారుమడులు వేయక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. రైతుల పక్షాన నిలబడతామని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం, నేడు అదే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. కాలువలకు సాగునీరు విడుదల చేసి 50 రోజులు కావస్తున్నా నేటికీ శివారు ప్రాంతాలకు నీరు చేరలేదని, ఖరీఫ్‌ సాగు చేయాలా లేక పంట విరామం ప్రకటించాలా అనే డైలమాలో రైతులు ఉన్నారని ఆమె అన్నారు. అభివృద్ధి పేరిట కాలువలపై వంతెనల నిర్మాణం, ముక్కామల – నడిపూడి లాకుల వరకూ రివిట్‌మెంట్‌ నిర్మాణంతో కాలువలను మూసివేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఈ అనాలోచిత నిర్ణయంతో సుమారు 20 వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నా కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారులు ఏమీ పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని, కాంట్రాక్టర్ల గోడు తప్ప రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. రైతుల పట్ల కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలువలపై అడ్డుకట్టలు తొలగించి, పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన పోరాడతామని అనురాధ హెచ్చరించారు.

వాడపల్లి వెంకన్న

ఆలయానికి పోలీసు భద్రత

ఆత్రేయపురం: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రానికి 26 మంది పోలీసులతో శాశ్వత భద్రత కల్పిస్తున్నట్లు ఆలయన ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ రాహుల్‌ మీనా చర్యలు తీసుకున్నారని శుక్రవారం విలేకర్లకు చెప్పారు. ఆలయానికి గణనీయంగా భక్తులు వస్తున్నందున ఈ చర్య తీసుకున్నారన్నారు. ఈ పోలీసులకు శాశ్వత ఆవాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతానికి వీరికి లొల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో వసతి కల్పిస్తున్నామని చెప్పారు.

అనపర్తిలో అరాచక పాలన

అనపర్తి: కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రి వేళ టీడీపీ ఇన్‌చార్జి తన అనుచరులతో దాడులకు దిగుతూంటే.. వారిని పరామర్శిస్తానంటూ బీజేపీ ఇన్‌చార్జి పగటి వేళ ప్రత్యర్థుల ఇళ్ల పైకి దండయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల అనపర్తి మండలం రామవరంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడిలో గాయపడిన వారిని ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, గత ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి నియోజకవర్గాన్ని ఐదేళ్లు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ప్రశాంతంగా పరిపాలిస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా కవరేజికి వెళ్లిన నొక్కు శ్రీను అనే విలేకరిపై కూడా దాడి చేసి, కంటి చూపు దెబ్బ తినేలా చేశారని, అలాగే, కోటిరెడ్డి, దళిత సామాజిక వర్గానికి చెందిన నందిక సత్యనారాయణను గాయపరిచారని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు తమ అనుచరులతో కలిసి నియోజకవర్గంలో పేట్రేగిపోతున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి, ఎమ్మెల్యే కుట్రపూరితంగా అదే సమయానికి వస్తానని చెప్పి, మారణాయుధాలతో గుండాలను సిద్ధం చేశారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement