ఆరేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించి.. కోట్లాది మంది ప్రాణాలను బలిగొని, ఎంతో మందిని దిక్కు లేనివారిని చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాజాగా కోవిడ్ కేసులు నమోదవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
● నాలుగేళ్ల తర్వాత
రాష్ట్రంలో కరోనా కేసులు
● వైఎస్సార్ జిల్లాలో 8 కేసులు
● వారిలో ఇద్దరి మృతి
● తిరుపతి, విశాఖ,
మంగళగిరిలోనూ బాధితులు
● తాజాగా గొల్లప్రోలులో బాలిక మృతి
● ఆందోళన వద్దంటున్న వైద్యులు
● అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, అమలాపురం: కరోనా మహమ్మారి మిగిల్చిన గాయాలు ఇంకా మానలేదు. ఆరేళ్ల కిందట కుదిపేసిన ఈ మహమ్మారి.. మానవ సంబంధాలను చిన్నాభిన్నం, ప్రశ్నార్థకం చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు.. కుటుంబ ఆధారాన్ని కోల్పోయి, దీనులుగా మిగిలిన వారు.. ఇలా కరోనా రక్కసి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్లీ కరోనా జాడలు కనిపిస్తూండటం అందరినీ కలవరపరుస్తోంది.
అటు మొన్న వైఎస్సార్ జిల్లా కడపలో 8 కోవిడ్ కేసులు వెలుగు చూడగా, వారిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తాజాగా విశాఖ నగరంలో 33 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్న అతడికి ప్రైవేటు ల్యాబ్‌తో పాటు అక్కడి కేజీహెచ్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మంగళగిరిలో సైతం కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా పొరుగున ఉన్న కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన పదహారేళ్ల బాలిక వెల్లూరు ఆసుపత్రిలో బుధవారం మృతి చెందడం కలవరం రేపుతోంది. దీంతో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకూ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదు. కానీ, చాలామంది ఈ లక్షణాలతో బాధ పడుతున్నట్లు సమాచారం. వీరు వైద్య పరీక్షలకు వెళ్లకపోవడంతో కేసులు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే, కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు కానీ, అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీరికి మరింత జాగ్రత్త అవసరం
సాధారణ వ్యక్తులకు కోవిడ్ వస్తే స్వల్ప జ్వరం, జలుబుతో తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఊపిరిత్తులు, గుండె బలహీనంగా ఉన్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులకు దారి తీసే ప్రమాదం ఉంది. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ వైరస్ తీవ్రత తగ్గింది. కానీ, కొన్ని వర్గాలకు మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా, బ్రాంకై టిస్, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ బాధితులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
వ్యాక్సిన్ వేసుకున్నా వస్తుందా?
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్, కొందరు బూస్టర్ కూడా తీసుకున్నట్లు తేలింది. అయితే, టీకా వేసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందే తప్ప, వైరస్ అస్సలు సోకదని చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2020–22 మధ్య కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సైతం విధించింది. అప్పట్లో కోవిడ్ నియంత్రణకు నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పటిష్ట చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, వైరస్ కట్టడికి కృషి చేసింది. నాడు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కోవిడ్ నియంత్రణకు ఎంతో దోహదపడింది. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులను వెంటవెంటనే గుర్తించారు. పెద్ద ఎత్తున కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ల్యాబ్‌లను సిద్ధం చేసింది. ఆక్సిజన్ సౌకర్యంతో వేలాదిగా పడకలను అందుబాటులోకి తెచ్చింది. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు.. వాటిలో ఉన్న బాధితులకు పౌష్టికాహారం, మందులు సైతం ఉచితంగా అందించి త్వరగా కోలుకునేందుకు తోడ్పాటునందించింది. కోవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సను సైతం నాడు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. వీటన్నింటితో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ విజయవంతంగా అందించింది. ప్రస్తుతం కరోనా జాడలు కనిపిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అప్రమత్తం కావాల్సి ఉంది. కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షించే ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు, ప్రత్యేక వార్డులను సిద్ధంగా ఉంచాలి. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.
వైరస్ కట్టడికి నాడు జగన్ ప్రభుత్వం చర్యలు
ఈ జాగ్రత్తలు మేలు
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు
నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన
వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. సొంత వైద్యం వద్దు.
మాస్క్, శానిటైజర్ తప్పనిసరి.
రద్దీ ప్రాంతాలు, ఇండోర్ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం
అలవాటు చేసుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, చిన్న పిల్లలు ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయి 94 కంటే తగ్గిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.


