● బ్రాండింగ్‌తో అంతర్జాతీయ
మార్కెట్‌కు ఎదగాలి
● కాయర్ కాన్‌క్లేవ్‌లో నిపుణుల సూచన
● అనాతవరంలో ప్రారంభమైన
రెండు రోజుల సదస్సు
సాక్షి, అమలాపురం: ‘మన దేశంలో ఉత్పత్తి చేసే కాయర్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది చెట్టు నుంచి వస్తున్న బంగారం. అయితే, సరైన బ్రాండింగ్ లేక, అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన గుర్తింపు లభించడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత నాణ్యమైన ఉత్పత్తి తయారు చేయాలి. డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై దృష్టి సారించాలి’ అని కాయర్ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు తెలిపారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో రెండు రోజుల కాయర్ కాన్‌క్లేవ్–2026 గురువారం ప్రారంభమైంది. ఉద్యాన, ఎంఎస్‌ఎంఈ, మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ప్రారంభించారు. తొలుత కాయర్ బోర్డు కార్యదర్శి ఎంఎస్ లక్ష్మీప్రియ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. తరువాత కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాయర్ రంగ నిపుణులు, నాబార్డు, ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, కాయర్ ఉత్పత్తుల తయారీ, ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై వివరించారు. గ్రామీణ ఉపాధి పెంపునకు కాయర్ పరిశ్రమ కీలకమని అన్నారు. ‘బ్రాండ్ కోనసీమ కాయర్‘ పేరుతో మార్కెటింగ్ చేపడితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
బ్రాండ్ కోనసీమతోనే అంతర్జాతీయ డిమాండ్
బ్రాండ్ కోనసీమను విస్తృతం చేస్తేనే జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ సాధ్యం. ఇక్కడ తయారయ్యే కాయర్ ఉత్పత్తులకు ఆ స్థాయి నాణ్యత ఉండాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలను రైతులు పండించాలి. ఉత్పత్తిదారుకు, ఉత్పత్తికి మధ్య ఉన్న అతి పెద్ద అంతరాన్ని ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
– టీఎల్‌ఎన్ రావు, సైంటిస్ట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్


