● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి
● సాయి కుటుంబ సభ్యులకు పరామర్శ
● పోలీసులు నిష్పక్షపాతంగా
వ్యవహరించాలని డిమాండ్
రావులపాలెం: దళిత యువకుడు ఆనే సాయి దారుణ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక కొత్త కాలనీలో సాయి కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గంజాయి మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా ఈ హత్యకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న సాయిని ఇంటి నుంచి బయటకు పిలిచి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పదేపదే కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకూ కేవలం ఒక్కరి పైనే కేసు నమోదు చేశారని, మిగిలిన అనుమానితులను వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇంతటి ఘోరమైన హత్యను ఒక్క వ్యక్తి చేయడం సాధ్యమేనా అనే సందేహానికి పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. ధనికులు, పలుకుబడి ఉన్నవారి విషయంలో ఒకలా, సామాన్యులకు మరోలా చట్టం అమలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించే ఈ కేసు దర్యాప్తును ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సమగ్రంగా చేపట్టాలని, కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఎస్పీని కలుస్తానని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని జగ్గిరెడ్డి చెప్పారు.


