అమలాపురం రూరల్: ప్రభుత్వం పంట కాలువలకు సకాలంలో నీరు అందించనందువల్లనే అమలాపురం నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామనే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. నడిపూడి ప్రధాన పంట కాలువపై అక్రమ బ్రిడ్జిల నిర్మాణాలను, చిందాడ గరువు వద్ద ఎండిపోయిన నారుమళ్లను వైఎస్సార్ సీపీ ఆర్‌టీఏ రాష్ట్ర జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లు త్రినాథ్‌వర్మతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మే 31 తర్వాత కాలువలకు నీరు విడుదల చేసినప్పటికీ, టెయిలెండ్, ఐల్యాండ్‌లకు అందకపోవడాని కి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. ముక్కామల నుంచి నడిపూడి మీదుగా చల్లపల్లి వరకూ ఉన్న ప్రధాన పంట కాలువ మీద అనధికార వంతెనల నిర్మాణంలో కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఈ పనులు జాప్యం చేశారని, తద్వారా నీరందకుండా రైతుల నడ్డి విరిచారని ఆరోపించారు. అధికార కూటమికి చెందిన రైతు నాయకులు కలెక్టరేట్, ఇరిగేషన్ డీఈఈ కార్యాలయాల వద్ద ధర్నా చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. సాగునీరు 46 రోజుల తర్వాత ఇవ్వడం వల్ల చివరిలో వచ్చే ప్రకృతి విపత్తులకు పంట చేతికందే పరిస్థితి ఉండదని, అందువల్లనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, ఉప్పలగుప్తం మండలం కూనవరం సముద్రం మొగలు మూసుకుపోతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని త్రినాథ్‌వర్మ డిమాండ్ చేశారు.
తునిలో పట్టాలు తప్పిన గూడ్స్
తుని: విశాఖపట్నం నుంచి నిడమనూరుకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలు వ్యాగన్ తునిలో గురువారం రాత్రి పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం – విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీఆర్‌పీ ఎస్సై సత్తిబాబు, స్టేషన్ అధికారుల కథనం ప్రకారం.. ఈ గూడ్స్ రైలుకు తుని రైల్వే స్టేషన్‌లో లూప్ లైన్‌కు సిగ్నల్ ఇచ్చారు. రాత్రి 9.30 గంటలకు 17వ నంబరు వ్యాగన్ పట్టాలు తప్పడంతో సగం బోగీలు తాండవ బ్రిడ్జిపై ఉండిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే గరీబ్‌రథ్, మచిలీపట్నం, రాయగడ, ప్రత్యేక రైళ్లను అధికారులు అనకాపల్లి జిల్లా పరిధిలోని స్టేషన్లలో నిలిపివేశారు. తాండవ బ్రిడ్జిపై ఉండిపోయిన బోగీలను వేరే ఇంజిన్‌తో అనకాపల్లి జిల్లా గుల్లిపాడు రైల్వే స్టేషన్‌కు తరలించారు. పట్టాలు తప్పిన వ్యాగన్‌ను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంతో విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


