అమలాపురం టౌన్: ముద్రగడ పద్మనాభం నీతి, నిజాయితీలకు, సమున్నత విలువలకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన మృతి కాపు ఉద్యమాలకు తీరని లోటు అని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి అన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లో గురువారం జరిగిన ముద్రగడ సంతాప సభలో ఆయన మాట్లాడారు. తొలుత దివంగత పద్మనాభం చిత్రపటానికి కాపు నేతలు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకూ నిలిచిన అరుదైన కాపు నేత పద్మనాభమని కొనియాడారు. కాపుల అభ్యున్నతి కోసం అహర్నిశలూ పోరాడారంటూ ఆయనతో కలసి ఉద్యమ పథంలో అడుగులు వేసిన కోనసీమ నేతలు తమ ప్రసంగాల్లో కన్నీరు పెట్టుకున్నారు. విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోనసీమ కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ. నల్లా పవన్ కుమార్, దివంగత నల్లా సూర్యచంద్రరావు కుమారులు అజయ్, సంజయ్‌తో పాటు సూదా గణపతి, నల్లా శ్రీధర్, తిక్కిరెడ్డి నేతాజీ తదితరులు ముద్రగడ ఉద్యమాల గురించి ప్రసంగించారు. త్వరలోనే గడియారం స్తంభం సెంటర్‌లో మరోసారి ముద్రగడ సంతాప సభ నిర్వహించి దాదాపు వెయ్యి మంది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తామని విష్ణుమూర్తి ప్రకటించారు.


