కాయర్ పరిశ్రమతో రైతులు, ఉత్పత్తిదారులు మమేకమవ్వాలి. అప్పుడే నాణ్యమైన ఉత్పత్తి, అందుకు తగిన ధర వస్తాయి. అంతర్జాతీయ పోటీకి తట్టుకుని నిలబడతాం. కేరళంలో సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దీనిని కోనసీమలో కూడా అమలు చేయాలి. కేరళం ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో కాయర్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఆవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఈ పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అవసరం. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకు రావాలి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గేకొద్దీ కాయర్ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుంది. కొబ్బరి పొట్టు, కాయర్ ఫైబర్, జియో టెక్స్‌టైల్, కాయర్ కంపోస్ట్, యాక్టివేటెడ్ కార్బన్‌కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు అనుబంధ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో మన కాయర్‌కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికా, చైనా దేశాల్లో వినియోగం పెరుగుతోంది. మన దేశం నుంచి చైనాకు పెద్ద ఎత్తున కాయర్ ఫైబర్ ఎగుమతి అవుతోంది. ఆటోమొబైల్, ఫైబర్ ఆధారిత పరిశ్రమల్లో వీటి వినియోగం పెరుగుతోంది. యాక్టివేటెడ్ కార్బన్‌కు ఇటీవల మంచి డిమాండ్ పెరిగింది. వైద్య, ఔషధ, నీటిశుద్ధి రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సుమారు రూ.5 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఆధునిక యంత్రాలు, సాంకేతికతతో నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలు సాధించి మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుంది.
– సమీర్ కృష్ణ, డైరెక్టర్,
కేరళం కాయర్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్


