సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో కొబ్బరికి కేరాఫ్ అడ్రస్‌గా గోదావరి జిల్లాలు నిలుస్తాయి. కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు అనగానే క్వాయర్(పీచు)తో తయారు చేసే వస్తువులే గుర్తుకు వస్తాయి. అందుకే వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ కార్యక్రమం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోనసీమ జిల్లా నుంచి కొబ్బరి, క్వాయర్‌ను ఎంపిక చేశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమలంటే ఎంతో కొంత క్వాయర్ పరిశ్రమలే కనిపిస్తాయి. వాస్తవానికి ఇవి పీచు ఉత్పత్తి, తాళ్ల తయారీ, కొబ్బరి పొట్టు, పొట్టుతో ఇటుకల తయారీకే పరిమితమయ్యాయి. దీనివల్ల క్వాయర్ రంగం తరచూ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. దీనిని అధిగమించేందుకు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.
ప్రాథమిక దశలోనే..
రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనే 1.30 లక్షల ఎకరాల్లో దీని సాగు ఉంది. మరో 30 వేల ఎకరాలకు సరిపడా చెట్లు కాలువలు, ఇళ్లు, చెరువుల చుట్టూ ఉన్నాయి. ఏడాదికి సగటున 112 కోట్ల కాయల దిగుబడి వస్తూండగా, స్థానిక అవసరాలకు పోనూ 95 కోట్ల కాయలు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో 70 శాతం స్థానికంగా ఒలిచి, ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో క్వాయర్ పరిశ్రమ ఇంకా ప్రాథమిక దశను దాటలేదు. దేశం నుంచి గత ఏడాది సుమారు 13.43 లక్షల టన్నుల క్వాయర్ ఉత్పత్తులు ఎగుమతి కాగా, అత్యధిక వాటా తమిళనాడు, కేరళ రాష్ట్రాలదే. మన రాష్ట్రం వాట 10 శాతం కూడా ఉండదని స్థానికులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఏటా లక్షల టన్నుల కొబ్బరి డొక్కలు అందుబాటులోకి వస్తున్నా వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలు లేక రైతులు ఆశించిన ఆదాయం పొందలేకపోతున్నారు. పది కిలోల కొబ్బరి డొక్క నుంచి 3 కిలోల క్వాయర్ పీచు, 6.5 కిలోల కోకోపీట్ లభిస్తుంది. ప్రస్తుతం పీచు కిలో రూ.10 నుంచి రూ.16, కోకోపీట్ కిలో రూ.8 నుంచి రూ.15 పలుకుతోంది. విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే దీని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. గతంలో మామిడికుదురు కేంద్రంగా క్వాయర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే, క్వాయర్ బోర్డు, పరిశ్రమల శాఖ నుంచి ఆశించిన స్థాయిలో చేయూత లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
నేడు క్వాయర్ కాన్‌క్లేవ్
అమలాపురం అనాతవరం వేదిక ఫంక్షన్ హాలులో గురువారం నుంచి రెండు రోజుల పాటు క్వాయర్ కాన్‌క్లేవ్–2026 నిర్వహిస్తున్నారు. కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో వ్యాపార అవకాశాలపై కేరళ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. ఏపీఐఐసీ, నాబార్డు, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొంటారు. విలువ ఆధారిత పరిశ్రమలను ఆధునీకరిస్తే.. ప్రభుత్వం, బ్యాంకులు, క్వాయర్ బోర్డు నుంచి తగిన ఆర్థిక ప్రోత్సాహం లభిస్తే యువ పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా గోదావరి జిల్లాలు దేశంలోనే ప్రముఖ క్వాయర్ హబ్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇలా చేస్తే మేలు
ప్రస్తుతం జిల్లాలో కొద్దిమేరకు పీచు తీసే యంత్రాలు, తాళ్ల తయారీ యూనిట్లు, కోకోపీట్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. క్వాయర్ వుడ్, క్వాయర్ ప్లేవుడ్, కంపోజిట్ బోర్డులు, జియో టెక్స్‌టైల్స్, గ్రోబ్యాగ్‌లు, హార్టికల్చర్ ప్యానెల్స్, మ్యాట్స్, మ్యాటింగ్‌లు, బ్రష్‌లు, ప్లాంటర్ల వంటి క్వాయర్ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అయినప్పటికీ, వీటిని తయారు చేసే యూనిట్లు జిల్లాలో లేవు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇవే ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందువలన ఈ యూనిట్లను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
స్థానికంగా కొబ్బరి పొట్టు ఉత్పత్తి అవుతున్నా.. దాని నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసే పరిశ్రమలు లేవు. ఇది చేస్తే క్వాయర్ పిత్‌కు ఇప్పుడు వస్తున్న దాని కన్నా ఐదు రెట్లు అదనంగా ఆదాయం వస్తుంది.
ఈ పరిశ్రమల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు కూడా అవసరం లేదు. చిన్న స్థాయి కోకోపీట్ యూనిట్‌కు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, ఆటోమెటిక్ పీచు యూనిట్‌కు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షలు, జియో టెక్స్‌టైల్ లేదా మ్యాట్ యూనిట్‌కు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు అవసరం. క్వాయర్ వుడ్ లేదా కంపోజిట్ బోర్డు పరిశ్రమకు రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ పెట్టుబడి సరిపోతుంది.
విలువ జోడిస్తే సిరులు కురిసే చాన్స్
గోదావరి జిల్లాల్లో పీచు పరిశ్రమలకు అపార అవకాశాలు
చేయూతనివ్వని క్వాయర్ బోర్డు, ప్రభుత్వం
ముందుకు రాని ఔత్సాహికులు


