కొత్తపేట: రైతుల ఆందోళనతో ఇరిగేషన్ అధికారులు దిగి వచ్చారు. వాడపాలెం ఓల్డ్ చానల్ కింద బిళ్లకుర్రు పంచాయతీ పరిధి యెలిశెట్టివారిపాలెం, నక్కావారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం గ్రామాల్లో సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో సంబంధిత రైతులు కనీసం నారుమళ్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రైతులు ఈ నెల 6న, మంగళవారం నక్కావారిపేట వద్ద కాలువలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. వీటిపై ‘సాక్షి’ ఆయా సందర్భాల్లో వార్తా కథనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ డి.చిన్నబాబు, ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ కె.వెంకటేశ్వరరావు, డీఈ కె.శ్రీరామ జనార్దనరావు, జేఈ వి.ప్రసన్న మాధవ్, నీటిసంఘం అధ్యక్షుడు బండారు వీరబాబు, రైతు సంఘం అధ్యక్షుడు చోడపనీడి భాస్కరరావు వాడపాలెం ఓల్డ్ చానల్‌ను పనసలదొడ్డి ప్రాంతంలో బుధవారం పరిశీలించారు. కాలువ ఆక్రమణలకు గురై కుచించుకుపోయిందని, మెరక అయ్యిందని, అనధికారిక తూరలున్నాయని గుర్తించారు. తక్షణం ఈ సమస్యలు పరిష్కరించి, రెండు మూడు రోజుల్లో శివారు ఆయకట్టుకు సాగునీరు అందించాలని స్థానిక అధికారులకు, నీటి సంఘానికి సూచించారు. ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ఈ పనులు ప్రారంభించారు.


