ఉద్యమ యోధుడిమహాభినిష్క్రమణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ యోధుడిమహాభినిష్క్రమణ

Jul 15 2026 1:58 AM | Updated on Jul 15 2026 1:58 AM

ముద్రగడ మృతితో ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం కన్నీరు మున్నీరవుతున్న అభిమానులు

నైతిక, రాజకీయ విలువలకు పెద్దపీట వేసిన నేత ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటున్న ప్రజలు

కాపు ఉద్యమ శిఖరం నేలకొరిగింది. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలకు పెద్ద పీట వేసి.. సమాజానికి ఎంతో ఇచ్చి.. తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు.. అనారోగ్యంతో సుదీర్ఘ కాలం పోరాడి.. అలసిపోయి.. తనువు చాలించారు. కాపు ఉద్యమ నేతగానే కాకుండా వర్గాలకు అతీతంగా అందరి అభిమానాన్నీ మూటగట్టుకున్న ఆ మహనీయుడు ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలియడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు అంతులేని విషాదంలో మునిగిపోయారు. ప్రజా జీవితంలో నిజాయితీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, అవమానాలకు తలొగ్గని ధీరత్వం, అపారమైన సహనం, పేదల పట్ల అంతులేని మమకారం వంటి సుగుణాలు కలిగిన అరుదైన అగ్రశ్రేణి నాయకుడు, మానవతా మూర్తి ఆయన. ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెదకాపు. ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో గొప్ప శకం ముగిసినట్లయ్యింది.

పిఠాపురం/గోకవరం/ప్రత్తిపాడు/ప్రత్తిపాడు రూరల్‌/కిర్లంపూడి/అన్నవరం: కొన్ని పేర్లు పదవుల వల్ల కాదు.. పోరాటాల వల్ల చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా.. అందరితో ఆప్యాయంగా వ్యవహరించే తత్వంతో ప్రజల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు విడిచి పెట్టని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆత్మగౌరవం, నమ్మిన సిద్ధాంతం కోసం గొప్ప పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి. నమ్మిన ప్రజల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మహనీయుడు.

ఉద్యమాలతో సంచలనం

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో ముద్రగడ చేసిన దీక్షలు, పోరాటాలు, పాదయాత్రలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ప్రత్యేకించి 2016లో తునిలో జరిగిన కాపు ఐక్యగర్జన సభ పెను సంచలనం రేపింది. ఆ ఉద్యమం తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ అణచివేత చర్యలు ఆయనను మరింతగా వార్తల్లో నిలిపాయి. ఆయన కుటుంబం పట్ల అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అమానవీయ వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తింది. ఎంత అణచివేతకు ప్రయత్నించినా రాజీ పడకుండా తను నమ్మిన సిద్ధాంతంపై ముద్రగడ మొక్కవోని పట్టుదలతో నిలిచి, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించారు.

ఆమరణ దీక్షే ఆయుధంగా..

ముద్రగడ రాజకీయ జీవితంలో నిరాహార దీక్షలు ప్రత్యేక అధ్యాయమనే చెప్పాలి. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారికి 1956కు ముందున్న మాదిరిగానే రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో తన సతీమణి పద్మావతితో కలిసి ముద్రగడ 1994 జూలై 1న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తరువాత కూడా కాపు రిజర్వేషన్ల అంశంపై అనేకసార్లు ఆమరణ దీక్షలు నిర్వహించి, సంచలనం సృష్టించారు.

నైతిక విలువలకు ప్రాధాన్యం

వ్యక్తిగత, రాజకీయ జీవితంలో నైతిక విలువలకు పెద్దపీట వేసిన నాయకుడు ముద్రగడ. రాజకీయంగా ఆయనతో విభేదించిన వారు కూడా ఉద్యమం పట్ల ఆయన నిబద్ధతను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సామాజికవర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు. ఒక్క కాపు సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాల్లోనూ ఆయనకు ఆత్మీయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముద్రగడ మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ముద్రగడ పద్మనాభం మృతితో ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామం కిర్లంపూడి తీసుకువచ్చి, అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచనున్నారు.

కోనసీమ గుండెల్లో...

అమలాపురం టౌన్‌/సాక్షి నెట్‌వర్క్‌: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో కలిసి కాపు ఉద్యమానికి ఊపిరులూదిన కోనసీమ కాపు నేతలు ఆయన మరణ వార్త వినగానే విచారంలో మునిగిపోయారు. ఆయనతో కలసి వేసిన ఉద్యమ అడుగులను గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ఉభయ గోదావరి జిల్లాల్లో కోనసీమతో ఎంతో అనుబంధం ఉంది. కాపు రిజర్వేషన్ల కోసం అమలాపురంలో చేపట్టిన ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అమలాపురానికి చెందిన నల్లా విష్ణుమూర్తి, నల్లా సూర్యచంద్రరావు సోదరుల ఆధ్వర్యాన 1993లో రాష్ట్ర కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి ఆవిర్భవించింది. ఆ సందర్భంగా ముద్రగడ అమలాపురం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో రథసప్తమి నాడు కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా విష్ణుమూర్తి, రాష్ట్ర కన్వీనర్‌గా ఆయన సోదరుడు దివంగత నల్లా సూర్యచంద్రరావు సారథ్యం వహించింది ముద్రగడ సమక్షంలోనే. కాపు రిజర్వేషన్ల కోసం అమలాపురంతో పాటు కోనసీమలోని పలు గ్రామాల్లో ఖాళీ కంచాలు, గరిటెలతో ఆయన ఆకలి చప్పుళ్లు వినిపించారు. కాపు ఉద్యమం సందర్భంగా అమలాపురంతో పాటు కోనసీమకు ముద్రగడ 37 సార్లు వచ్చి ఇక్కడి కాపుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.

రక్తం చిందిన చోటే రగిలిన కాపు ఉద్యమం:

రావులపాలెంలో 1993లో జరిగిన సభకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంగా కాపు రిజర్వేషన్ల కోసం ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన స్వీకరించలేదు. ఆందోళనకు దిగిన కాపులపై పోలీసుల లాఠీచార్జీ చేశారు. ఆ సందర్భంగా దాదాపు 40 మంది కాపు నాయకులు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు ముద్రగడ అప్పట్లో కోనసీమకు వచ్చారు. అప్పటికే ఆయన మంత్రిగా పని చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం అప్పటి ప్రభుత్వంతో విభేదించి, పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. రక్తం చిందిన రావులపాలెం సభా వేదిక వద్దనే కొన్ని నెలలకే జరిగిన కాపు ఉద్యమ సభలో ముద్రగడ చేసిన ప్రసంగం ఉత్తేజపరిచింది. కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ ముద్రగడ నిర్వహించిన సైకిల్‌ యాత్ర అప్పట్లో ఓ ప్రభంజనం సృష్టించింది. అమలాపురానికి చెందిన కాపు ఉద్యమ నేతలు కల్వకొలను తాతాజీ. నల్లా పవన్‌ కుమార్‌, రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన ఆకుల రామకృష్ణ తదితరులు కాపు ఉద్యమాల పరంగా ముద్రగడ అడుగు జాడల్లోనే నడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement