సాగు సమ్మె ప్రకటించమంటారా?
కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మనందం, కార్యదర్శి అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, రైతు నాయకులు మట్టా ప్రభాకరరావు, యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ, డెల్టాకు సాగునీరు విడుదల చేసి 45 రోజులు గడుస్తున్నా నియోజకవర్గంలోని శివారు భూములకు ఆ నీరందక వరి నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో పుష్కలంగా నీరుండి, సముద్రంలోకి మిగులు జలాలు వెళ్లిపోతున్నా ఈ దుస్థితి ఏమిటని మండిపడ్డారు. ఒక్క ఎకరానికి కూడా పూర్తి స్థాయిలో నీరివ్వలేని అధ్వాన స్థితిలో ఇరిగేషన్ అధికారులున్నారని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో కాలువలకు నీరు విడుదల చేస్తారనగా 216ఈ బైపాస్ రోడ్డు చెంతన ముక్కామల – నడిపూడి లాకుల మధ్యన రక్షణ గోడ పనులు ప్రారంభించారని, అమలాపురంలో ఏడు వంతెన అభివృద్ధి పనులకు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రక్షణ గోడ పనుల కోసం తవ్విన మట్టిని కాలువల్లో అడ్డంగా వేయడంతో సాగునీరు దిగువకు రావడం లేదని చెప్పారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ 40 వేల ఎకరాలకు నీరు అందకుండా ఈ పనులు చేయడమేమిటని ప్రశ్నించారు. కాలువలో అడ్డంగా ఉన్న మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని రైతుసంఘాల ప్రతినిధులు ఆకుల లక్ష్మణరావు, రాజులపూడి మురళీకృష్ణ, రాజులపూడి నాగేశ్వరరావు, దాట్ల గోపిరాజు తదితరులు హెచ్చరించారు.
● రైతుల డిమాండ్
● ఇరిగేషన్ డీఈ కార్యాలయం ముట్టడి
● తాళాలు వేసేందుకు ప్రయత్నం
● కలెక్టరేట్ వద్ద ధర్నా
● అడ్డుకున్న పోలీసులు
● క్రాప్ హాలిడే ప్రకటిస్తామని
అన్నదాతల హెచ్చరిక
● అమలాపురంలో ఉద్రిక్తత
అమలాపురం రూరల్: నియోజకవర్గంలోని కాలువలకు పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయాలనే డిమాండుతో కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతులు మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఇరిగేషన్ డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపించి, కార్యాలయానికి తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ రైతులు కార్యాలయం లోపలకు రైతులు దూసుకు వెళ్లారు. ఇరిగేషన్ డీఈ తక్షణమే వచ్చి సమాధానం చెప్పాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. డీఈ శ్రీరామ జనార్దన్‌ను సీఐ వీరబాబు కార్యాలయానికి రప్పించి, రైతులతో చర్చలు జరిపారు. గురువారం సాయంత్రానికల్లా పూర్తిగా నీళ్లు అందిస్తామని ఈఈ వెంకటేశ్వరరావు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


