● బిళ్లకుర్రు రైతుల అల్టిమేటం
● నీరు పారని కాలువలో కూర్చుని
పురుగు మందు డబ్బాతో నిరసన
కొత్తపేట: తక్షణం సాగునీరు అందించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని మండలంలోని బిళ్లకుర్రు పంచాయతీ పరిధిలోని యెలిశెట్టివారిపాలెం, నక్కావారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం గ్రామాల రైతులు, కౌలు రైతులు అల్టిమేటం జారీ చేశారు. వాడపాలెం ఓల్డ్ చానల్ కింద బిళ్లకుర్రు పంచాయతీ పరిధిలోని ఈ గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాలకు సాగునీరందక నేటికీ నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆ గ్రామాల రైతులు ఈ నెల 6న నక్కావారిపేట వద్ద కాలువలో బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో, అధికారులు వచ్చి సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది జరిగి వారం రోజులైనా చుక్క నీరు కూడా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం మరోసారి అదే కాలువలో పురుగు మందు బాటిల్‌తో కూర్చుని నిరసన తెలిపారు. ఈ చానల్ ద్వారా గతంలో రెండు పంటలతో పాటు మెరక పొలాలకు కూడా నీరందేదని, కొన్నేళ్లుగా రబీలో నీరు రాక మొక్కజొన్న సాగు చేస్తున్నామని, ఈసారి ఖరీఫ్‌లో కూడా సాగునీరు సరఫరా చేయకుండా అధికారులు, అధికార కూటమి నాయకులు సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రెండు పంటలకు కలిపి భూ యజమానులకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ అప్పులు చేసి, భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి శిస్తు అడ్వాన్సులు చెల్లించామని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా చూస్తే ప్రధాన పంట కాలువలకు సాగు నీరు విడుదల చేసి 45 రోజులైనా ఈ చానల్‌కు నీరు రాక నేటికీ నారుమడులు వేయలేకపోయామని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని కౌలు రైతులు వాపోయారు. సాగునీటి సరఫరాకు ఉన్నతాధికారులు తక్షణం నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
పరిహారం ఇప్పించండి.. వలస పోతాం
ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు ఇరిగేషన్ ఇన్‌చార్జి జేఈ మాధవ్ వచ్చి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వారం క్రితం వచ్చి కూడా ఇదే చెప్పారని, ఇప్పుడూ అదే చెబుతున్నారని, ఇప్పటి వరకూ ఏం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి శిస్తు అడ్వాన్స్ చెల్లించానని, ఇప్పుడు నీరివ్వకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని యెలిశెట్టి త్రిమూర్తులు అనే రైతు పురుగు మందు తాగే ప్రయత్నం చేయగా సహచర రైతులు వారించారు. ఇరిగేషన్ అ ధికారులు, నీటి సంఘం నిర్లక్ష్యానికి తాము నష్టపోవాలా అని నిలదీశారు. సాగునీరివ్వలేకపోతే మొ త్తం చానల్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించి, తాము రైతులకు చెల్లించిన శిస్తులు, నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తంతో పట్టణాలకు వలస పోయి, కూలి పని చేసుకుని బతుకుతామని వాపోయారు. తహసీల్దార్ వై.రాంబాబు అక్కడకు చేరుకుని, సంబంధిత అధికారులతో సమీక్షించి, సమస్య పరిష్కారిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
నీటిసంఘం డైరెక్టర్ రాజీనామా
సాగునీటి సరఫరాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జననేన పార్టీకి చెందిన నీటిసంఘం డైరెక్టర్ యెలిశెట్టి వీర్రాజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో అవిశెట్టి గోపాలకృష్ణ, గొలకోటి వెంకటేశ్వరరావు, యాళ్ల వెంకటేష్, యెలిశెట్టి శివాజీ, పులపకూర సత్యనారాయణ, భగవంత్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


