అల్లవరం: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం రానున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆక్వా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం, విద్యుత్ చార్జీలు, ఫీడ్ ధరల పెరుగుదల, రొయ్యలను వెంటాడుతున్న తెగుళ్లు తదితర అంశాలపై జగన్ స్వయంగా ఆక్వా రైతులను అడిగి తెలుసుకుంటారని వివరించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు, ఆక్వా రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గడువు పెంచినా.. సవాలే ‘సర్’
సాక్షి, అమలాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును ఎన్నికల కమిషన్ ఈ నెల 24వ తేదీ వరకూ పెంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ గడువు మంగళవారం రాత్రితో ముగియాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ ఫారాలు 99,662 నమోదయ్యాయి. అత్యధికంగా కాట్రేనికోనలో 11,050, ఐ.పోలవరంలో 6,302, తాళ్లరేవులో 6,229, రావులపాలెంలో 5,717, అమలాపురం రూరల్‌లో 5,695 వరకూ అన్ కలెక్టబుల్ ఫారాలున్నాయి. ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడం, చిరునామా మారడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి కారణాలతో వీటిని సేకరించలేకపోయినట్లు అధికారులు గుర్తించారు. గడువు మరో పది రోజులు పెంచినప్పటికీ ఈ ఫారాలు సర్‌లో పాల్గొనే యంత్రాంగానికి సవాలుగానే మిగలనున్నాయి. జిల్లాలో మొత్తం 13,15,007 మంది ఓటర్లకు గాను 13,14,788 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. ఇంకా 219 ఫారాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పురోగతి 99.983 శాతానికి చేరింది. అయితే అన్ కలెక్టబుల్ ఫారాల పరిశీలనకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది ఆయా చిరునామాలను మరోసారి పరిశీలించి, సంబంధిత ఓటర్లను గుర్తించే చర్యలు చేపడుతున్నారు. వీటిలో మృతులను తొలగించగా, మిగిలిన వారిని గుర్తించడం సిబ్బందికి పెను సవాలుగా మారనుంది.
జగ్గిరెడ్డిపై విమర్శలు సరికాదు
సాక్షి, అమలాపురం: ‘కూటమి పాలన మొదలైన తరువాత ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, దౌర్జన్యాలతో అణచి వేయాలని చూస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై మాట్లాడినందుకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై టీడీపీ నాయకులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయ డం భావ్యంగా లేదు’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్ విమర్శించారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎదురు దాడి చేయడం మాని, జగ్గిరెడ్డి లేవనెత్తిన సమస్యలకు పరిష్కా రం చూపాలని టీడీపీ నాయకులను డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, దీనిపైనే జగ్గిరెడ్డి గొంతు విప్పారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక, ఫీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు నష్టపోతున్నారని, ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.


