అమలాపురం రూరల్: సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, నీటి పారుదల అధికారులు, కాంట్రాక్టర్లు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సర్ 99 శాతం పూర్తి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో 99 శాతం పూర్తయిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో సర్ ప్రక్రియ 100 శాతం ముగిసిందన్నారు. ఆత్రేయపురం మండలంలో మాత్రమే ఇంకా స్వల్పంగా మిగిలి ఉందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలు విడుదల చేయాలి
అమలాపురం రూరల్: పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగలవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్ మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించడం లేదని, కుక్, కమాటి, వార్డెన్ పోస్టులు భర్తీ చేయడం లేదని, దీనివలన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో సర్టిఫికెట్లు చేతికి రాక విద్యార్థులు నానా అగచాట్లూ పడుతున్నారని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ నంబర్–77 రద్దు చేస్తానని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శులు శ్యామ్, వినయ్, చిరు, జిల్లా నాయకులు గణేష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కళా స్రవంతి వార్షికోత్సవం
● 8 మందికి ‘కళా ప్రవీణ’ ప్రదానం
కొత్తపేట: కళలకు పచ్చని పంట పొలం తెలుగు నేల ప్రముఖ అంతర్జాతీయ శిల్పి, శ్రీనాథరత్నశిల్పి వుడయార్ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డి.రాజ్‌కుమార్ వుడయార్ అన్నారు. శ్రీకళా స్రవంతి సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంక్షేమ సేవా సంఘం 6 వ వార్షికోత్సవాన్ని మంగళవారం మండల పరిధిలోని పలివెల కళా స్రవంతి కళా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కొమారిపాటి ఏసు వెంకటప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో శిల్పకళా రత్న ఆచార్య డి.రాజ్ కుమార్ వుడయార్ ముఖ్య అతిథిగా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి పలు కళా సంఘాల అధ్యక్షులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళలకు చెందిన షేక్ ఇబ్రహీం సాహెబ్, మానేపల్లి సూర్యనారాయణ, ఠాణేలంక కుమారస్వామి, మానేపల్లి త్రిమూర్తులు, మిరియాల గనిరాజు, మహంకాళి సుబ్బారావు, పెళ్ళూరి మైసూర్ రాజు, కొమ్మర నాగేశ్వరరావులను కళా ప్రవీణ బిరుదుతో సత్కరించారు.
పారాలీగల్ వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీ య న్యాయ సేవాధికార సంస్థ శ్రీపారా లీగల్ వలంటీర్‌గా ఏడాది కాల పరిమితికి పనిచేసేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ ఎల్.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. మెట్రిక్యులేషన్, తత్సమానమైన విద్యార్హత కలిగి, 18 ఏళ్లు నిండిన వారికి మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తామన్నారు. ఈనెల 18 వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలో 50 నుంచి 100 మంది వరకు, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేట, అనపర్తి, ప్రత్తిపాడు, రంపచోడవరం, అడ్డతీగల మండల న్యాయ సేవాధికార కమిటీల పరిధిలో ప్రతి మండలానికి 25 నుంచి 50 మంది వరకు పారా లీగల్ వాలంటీర్లను ఎంపిక చేయనున్నామన్నారు. దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలకు సమీపంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంబంధిత మండల న్యాయ సేవాధికార కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులను సంప్రదించాలన్నారు.


