ఆస్తి కోసం ఆలిని కడతేర్చాడు | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం ఆలిని కడతేర్చాడు

Jul 15 2026 1:58 AM | Updated on Jul 15 2026 1:58 AM

రాజవోలు గ్రామంలో దారుణం

అనాథలైన పిల్లలు

ధవళేశ్వరం: సొంత అక్క కూతురుని వివాహం చేసుకున్నాడు. పైళ్ళె 17 ఏళ్లు గడిచా యి. సాఫీగా సాగుతున్న సంసారంలో ఆస్తి తగాదాలు ప్రకంపనలు సృష్టించాయి. మనస్పర్థలు ముదిరి హత్యకు దారి తీశాయి. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం రాజవోలు గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజవోలు గ్రామం కోనేరు వీధికి చెందిన చింతా వరప్రసాద్‌ 2009లో అతని అక్క కూతురు చింతా నాగమణి (32)ని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వరప్రసాద్‌ వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. రాజవోలులోని అక్క పేరున ఇంటిని తన పేరున రాయాలని వరప్రసాద్‌ తన భార్యను వేధిస్తున్నాడు. నాగమణి సోదరితో కలిసి బాలాజీపేటలోని ఒక బిర్యానీ షాపులో పనిచేస్తోంది. మంగళవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన నాగమణితో ఎవరికి చెప్పి పనికి వెళ్లావంటూ గొడవ పడిన వరప్రసాద్‌ తన పనిముట్టు బాదిదతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ శివప్రియ, సీఐ టి.గణేష్‌, ఎస్సై హరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

అనాథలైన పిల్లలు

నాగమణికి ఇద్దరు పిల్లలు బొమ్మూరులో ఒక ప్రైవేటు పాఠశాలలో కుమార్తె పదో తరగతి, కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. కన్నతండ్రే తల్లిని చంపడంతో వారి రోదన కంటతడి పెట్టించింది. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement