సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీదేవి సమేత కుమారారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. పరమ శివునికి ప్రీతికరమైన రోజు, స్వామి వారి జన్మ నక్షత్రం ఆరుద్ర కలసి రావడంతో కార్తిక సోమవారాన్ని గుర్తు చేసేలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి పుష్కరిణి జలాలు, పాలతో స్వయంగా అభిషేకాలు చేసుకున్నారు. ఉచిత దర్శనానికి ఆలయం మొదటి అంతస్తులోను, ప్రత్యేక దర్శనానికి ఆలయ ప్రాంగణంలోను బారులు తీరారు. వీఐపీల తాకిడి కూడా పెరగడంతో భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. పిఠాపురం మహారాజా గోత్రనామాలతో తెల్లవారుజామున తొలి అభిషేకం, తొలి పూజలను అర్చకులు నిర్వహించారు. వీటిని భక్తులు అధిక సంఖ్యలో తిలకించారు. కాలభైరవ స్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, మూలవిరాట్, ఉపాలయాలను, స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు సాయంత్రం ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యాన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


