అమలాపురం రూరల్: అమలాపురం మండలం ఈదరపల్లి నుంచి అంబాజీపేట మండలం ముక్కామల వరకూ జాతీయ రహదారి–216ఇకి ఆనుకుని ఉన్న ప్రధాన పంట కాలువ రివిట్‌మెంట్ వాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైవే అధికారులతో కలసి ఈ వాల్ నిర్మాణ పనులను సిరిపల్లి వద్ద ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముక్కామల – ఈదరపల్లి ప్రధాన పంట కాలువపై ఆధారపడి పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ కాలువ గట్టు కోతకు గురవుతున్నందున రివిట్‌మెంట్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. దీనివలన కాలువకు, రహదారికి రక్షణ కల్పించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడవచ్చని చెప్పారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


