ధాన్యం అమ్మకం సమస్య పరిష్కరించండి ˘ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం అమ్మకం సమస్య పరిష్కరించండి ˘

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

ఎంపీ బోస్‌

రామచంద్రపురం: రబీ మాసూళ్లు జరుగుతున్న సమయంలో ధాన్యం అమ్మకాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో లక్ష 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారన్నారు. దీనికి సరిపడా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు జిల్లాలో లేవన్నారు. మొత్తం 11 మాత్రమే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు కోనసీమ జిల్లాలో ఉన్నాయని, ప్రస్తుత రబీ సీజన్‌లో ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం లేదన్నారు. దీంతో పాటుగా ప్రభుత్వానికి రూ.250 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాలని, కేవలం 11 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉండటం వల్ల అంత సొమ్ము కట్టే తాహతు వాటికి లేదన్నారు. మండపేట, రాయవరం, అనపర్తి తదితర ప్రాంతాల్లో ఉండే రైస్‌ మిల్లులకు జిల్లా వాసులు ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని ఎంపీ బోస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మత్స్యకారుల మధ్య

చిచ్చు పెట్టొద్దు ˘

మాజీ ఎమ్మెల్యే పొన్నాడ

ముమ్మిడివరం: తమిళనాడు మత్స్యకారులకు వత్తాసు పలుకుతూ మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌, మాజీ ఎమెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ విమర్శించారు. ఆయన ముమ్మిడివరంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మత్య్సకారుల సంక్షేమానికి మేలు చేయగా చంద్రబాబు ప్రభుత్వం వారికి అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. జువ్వెలదిన్నె హార్బర్‌ విషయంలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 10 షిపింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. హార్బర్లు లేకపోతే మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లి పోవల్సిన దుస్ధితి ఏర్పడుతుందన్నారు. జువ్వెలదిన్నె హార్బర్‌ను రూ.300 కోట్లతో జగన్‌ నిర్మిస్తే చంద్రబాబు ప్రభుత్వం కొంత భాగాన్ని సాగర్‌ డిఫెన్స్‌ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించడాన్ని ఆ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. తమిళనాడుకు చెందిన ఫైబర్‌ బోట్లు, పెద్ద బోట్లతో వేటాడుతున్నా చంద్రబాబు సర్కారు వారికి అండగా నిలబడుతోందన్నారు. సమస్యను పరిష్కరించకుండా మత్య్సకారుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు(బాబీ), ఎస్‌ఈసీ మెంబర్‌ కాశి బాలమునికుమారి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఢిల్లీ నారాయణ, పెయ్యల చిట్టిబాబు, నల్లా నరసింహమూర్తి, నేల కిశోర్‌ పాల్గొన్నారు.

రైతులకు ప్రాధాన్యమివ్వాలి

తాళ్లరేవు: పెట్రోలు బంకుల్లో డీజిల్‌ సరఫరాకు సంబంధించి రైతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, వరి కోత మెషీన్ల వినియోగానికి ఇచ్చిన తరువాతే మిగిలిన వారికి సరఫరా చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన తాళ్లరేవు హెచ్‌పీసీఎల్‌ బంకును తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తహసీల్దార్‌, వ్యావసాయ అధికారులు నిర్ధారించిన వారికి రోజుకు 70 కిలోలీటర్ల డీజిల్‌ సరఫరా చేస్తారన్నారు. మిగిలిన వారికి టిన్నులు, బాటిళ్లలో డీజిల్‌ సరఫరా చేయవద్దని బంకు యజమానులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement