● ధరలతో ఇక కష్ట‘వంట’
● మార్కెట్‌లో భారీగా
పెరిగిన వంట నూనెలు
● పట్టించుకోని చంద్రబాబు సర్కారు
● జిల్లాలో 4.93 లక్షల
కుటుంబాలపై ప్రభావం
ఆలమూరు: వంట నూనెల ధర సలసల కాగుతోంది.. వంటింట్లో ధరల మంట రేపుతోంది.. కూరల్లో నూనె చుక్క కరవవుతోంది.. పిండి వంటలు ఊసే మరిచిపోవాల్సి వస్తోంది.. మార్కెట్‌లో వంట నూనెల ధర కొండెక్కింది. సామాన్యులకు పెనుభారంగా మారింది. మార్కెట్‌కు వెళ్లి నూనె ప్యాకెట్ కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిత్యావసరాల ధరల నియంత్రణపై ముందుచూపు లేక ప్రజలకు శాపమైంది. ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రభావంతో బహిరంగ మార్కెట్‌లో నూనెల ధర మంట రేగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రెండేళ్లలో లీటరుకు రూ.50 పైనే పెరిగింది. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్ ధరలతో ప్రజలు సతమతమవుతుంటే, రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తోంది. రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం పంపిణీకే పరిమితం కావడం మరింత ఇబ్బందిగా మారుతోంది.
ముం‘ధర’ యుద్ధం
జిల్లాలోని 19 మండలాల్లో 4.93 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరిపై ఈ ధరల పెరుగుదల కారణంగా నెలకు రూ.మూడు కోట్ల వరకూ అదనపు భారం పడుతోంది. జిల్లాలో సగటున నెలకు సుమారు 100 టన్నుల వరకూ వంట నూనెలను ఉపయోగిస్తున్నారు. గతంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సాకుతో పెంచిన ధరల తరహాలోనే, ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం అంటూ పెరిగిన ధరలను ఆసరాగా చేసుకుని బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు ఽకృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వంట నూనె ధరలను రోజు రోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. దీనిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక వ్యాపారుల ఇష్టారాజ్యం అవుతోంది.
సుంకాలు తగ్గిస్తేనే ఉపశమనం
ఇజ్రాయిల్, అమెరికా – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో వంట నూనెలపై విధించిన భారీ సుంకాలను కొంతమేరైనా తగ్గిస్తేనే ధరల భారం తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో 2024 ఆగస్టు వరకూ ఎటువంటి సుంకాలు లేని పామాయిల్, సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి ముడి సరకుగా దిగుమతి చేసుకునే వంట నూనెలపై విధించిన 20 శాతం మేర బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీటీ)ని తగ్గిస్తే ప్రజలకు ధరాభారం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగే శుద్ధి (రిఫైన్డ్) చేసిన వంట నూనెలపై గతంలో పెంచిన 32.5 శాతం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల ప్రతి లీటర్ ప్యాకెట్‌కు రూ.20 నుంచి రూ.30 వరకూ తగ్గుతుందని భావిస్తున్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాలనే తారతమ్యం లేకుండా రోజూ ఇంట్లో వంటకాల్లో ఉపయోగించే వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రాయితీ.. లేక అధోగతి
రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన వంట నూనె ధరల నుంచి పేదలకు ఉపశమనం కలిగించేందుకు రేషన్‌న్‌షాపుల ద్వారా రాయితీపై వంట నూనెలను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కందిపప్పు, వంట నూనెలను సరఫరా చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఆ మాటను నేడు మరిచారు. అలాగే మార్కెట్లో వ్యాపారులు సృష్టించే కృత్రిమ కొరతను అరికట్టలేకపోతున్నారు. అలాగే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదు. అలాంటి చర్యలూ చేపట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా వాటిపై దృష్టిసారిస్తే మేలని విశ్లేషకులు భావిస్తున్నారు.
వంట 2024 2025 2026
నూనెలు లీటరు (రూ.) లీటరు (రూ.) లీటరు (రూ.)
పామాయిల్ 95 113 142
సన్‌ఫ్లవర్ 115 135 168
సోయాబీన్ 108 130 162
వేరుశెనగ 157 168 186
రైస్ బ్రాన్ 118 128 173
నియంత్రణకు చర్యలు అవసరం
వంట నూనె ధరల నియంత్రణకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి. వంటకాల్లో నిత్యం ఉపయోగించుకునే నూనెల ధరలు ఒకేసారి అంత దారుణంగా పెంచడం సరికాదు. రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై నూనెలను సరఫరా చేయాలి. అప్పుడే సామాన్యులకు వెలుసుబాటుగా ఉంటోంది.
– ఎస్.ధనలక్ష్మి, గృహిణి, ఆత్రేయపురం
సరఫరా నిలిచిపోయింది
హోల్‌సేల్ మార్కెట్ల నుంచి వంట నూనెల సరఫరా పూర్తి స్థాయిలో జరగడం లేదు. తమ వద్ద నిల్వలను ఇప్పటికే పాత ధరలకే విక్రయించాం. హోల్‌సేల్ వ్యాపారుల ధరలకనుగుణంగా క్షేత్ర స్థాయిలో విక్రయాలు జరపక తప్పడం లేదు.
– పిల్లి నాగరాజు, రిటైల్ వ్యాపారి,
పినపళ్ల, ఆలమూరు మండలం
ఆందోళన కలిగిస్తోంది
రోజు రోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాలను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రాయితీపై అందించాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వంట నూనెల ధర పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
– వాసిరెడ్డి వీరబాబు,
నర్శిపూడి, ఆలమూరు మండలం


