● ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు
● సందర్శించిన ఎస్పీ
దేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో తొలి రోజే భక్తుల తాకిడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి, మరియ తల్లిని దర్శించుకుని, దీవెనలు పొందారు. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకూ పుణ్యక్షేత్రంలో గడిపి ప్రార్థనలు, పూజలు చేస్తారు. తొలి రోజు సహాయ గురువులు ఫాదర్ ప్రేమ్‌కుమార్ దివ్య బలి పూజ సమర్పించారు. పలువురు గురువులు, ఫాదర్లు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ మళ్లింపు
గుండుగొలను – కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మలగిరి పుణ్యక్షేత్రం విస్తరించినందున భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ను మళ్లించినట్టు సీఐ నాయక్ తెలిపారు. దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, పంగిడి గ్రామాల్లో ట్రాఫిక్‌ను 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు.
215 మందితో బందోబస్తు
మేరీ మాత ఉత్సవాలకు 215 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపారు. ఉత్సవాలు నాలుగు రోజులూ పుణ్యక్షేత్రానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్పారన్నారు. అదనపు ఎస్పీ ఇన్‌చార్జిగా ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 21 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పుణ్యక్షేత్రంలోని 30 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు డ్రోన్ కెమెరాలు, క్రైం పార్టీని కూడా ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించడానికి ఈ ఏడాది అత్యాధునికమైన 50 ఫింగర్ ప్రింట్ డివైజ్‌లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటి ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. ఫేస్ రికవరీ పరికరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.


