● భక్తుల కొంగుబంగారం విజయదుర్గా పీఠం
● భక్తులను బంధువులుగా పిలిచే ‘గాడ్’
రాయవరం: అక్కడ అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. నిత్యం దేవీ నామస్మరణ తో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచే ఆ ప్రదేశానికి వెళ్లగానే బంధువుల మాదిరిగా పలకరింపులే కాదు.. మానసిక చింతనతో వెళ్లే వారికి బాధలను తొలగించే సలహాలు సైతం అందుతాయి. అదే భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతున్న విజయదుర్గా పీఠం. రాజమహేంద్రవరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరాన రాయవరం మండలం వెదురుపాకలో ఈ పీఠం వెలుగొందుతోంది.
పీఠం వ్యవస్థాపక అధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం పుట్టినప్పటి నుంచే ‘గాడ్’గా పిలుపు అందుకున్నట్లు భక్తులు చెబుతారు. 1972 ఆగస్టు 18వ తేదీన స్వయంగా జగన్మాత వ్యాఘ్రవాహినిగా దర్శనమిచ్చి మంత్రోపదేశం చేసినట్లు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ పీఠం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 1989లో శృంగేరి జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి ఆదేశంతో భారతీతీర్థ స్వామి చేతుల మీదుగా అష్టభుజాలతో కూడిన విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ ఈ పీఠంలో జరిగింది. ఇక్కడ నిత్యం పలు పూజలు నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పీఠానికి వస్తారు. భక్తులను గాడ్.. అబ్బాయి, అల్లుడు, కూతురు, కోడలు వంటి వరుసలతో పిలుస్తారు.
ఏటా శరన్నవరాత్ర వేడుకలు
పీఠంలో ఏటా దసరా శరన్నవరాత్ర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ పది రోజులూ భక్తులు స్వయంగా కలశాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటారు. ఏటా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో పీఠాధిపతి ‘గాడ్’ జన్మదిన వేడుకలను భక్తులే ఘనంగా నిర్వహించుకుంటారు. 19వ తేదీన జరిగే గాడ్ జన్మదిన వేడుకలకు వేలాదిగా తరలివస్తారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, పుష్పగిరి పీఠాధిపతులు అభినవ ఉద్దండ విద్యానృసింహ భారతీ స్వామి, సద్గురు శివానందమూర్తి, శ్రీ విశ్వయోగి విశ్వంజీ తదితర ప్రముఖులెందరో ఈ పీఠాన్ని సందర్శించారు.
లోక కల్యాణం కోసం..
పీఠంలో లోక కల్యాణం కోసం నిత్యం పలు రకాల పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూంటారు. ప్రత్యేక సందర్భాల్లో రాహుకేతువుల కల్యాణం, నవావరణార్చన, శ్రీనివాస కల్యాణం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వంటివి నిర్వహిస్తారు. టీటీడీ శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి, తిరుత్తణి దేవస్థానం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పీఠానికి అందజేశాయి.


