అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరి అకాడమీలో అండర్–7 జిల్లా చెస్ చాంపియన్ పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఇందులో ఏడేళ్ల లోపు చెస్ క్రీడాకారులైన చిన్నారి విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల్లో ప్రథమ స్థానాన్ని ఆరేళ్ల వయసు కలిగిన తటవర్తి అవ్యక్త సాధించగా, ద్వితీయ స్థానాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కుమార్తె ఆరేళ్ల ఎం.సంస్కృతి పొందింది. అలాగే బాలుర విభాగంలో రావులపాలేనికి చెందిన ఆరేళ్ల దంగేటి అరుణ్ ప్రథమ, ఐదేళ్ల ఉడతా శ్రీకర్ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ విజేతలు వచ్చే నెల 5 నుంచి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–7 చెస్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో పీజీఆర్‌ఎస్, మీకోసం రెవెన్యూ క్లీనిక్ సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కార మార్గాలను పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, తదితర వివరాల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోచ్చని కలెక్టర్ వివరించారు.
భజే విఘ్ననాయకా..
అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి గణపయ్యను ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 43 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 మంది, గరిక పూజలో ఒక జంట పాల్గొన్నారు. 19 మంది ఉండాళ్ల పూజ, ఒక చిన్నారికి అక్షరాభ్యాసం నిర్వహించారు. తొమ్మిది మందికి తులాభారం, ఓ చిన్నారికి అన్నప్రాశన, 30 మంది వాహన పూజ లు చేయించుకున్నారు. 2,694 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి రూ.2,19,358 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


