● ముగిసిన సీఆర్‌సీ ఉగాది నాటిక పోటీలు
● విజేతలకు బహుమతుల ప్రదానం
రావులపాలెం: స్థానిక కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ) ఆధ్వర్యంలో కాటన్ కళావేదికలో ఉగాది రోజున మొదలైన తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శనివారం అర్ధరాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా చిటికెన వేలు నాటిక నిలిచింది. అనంతరం బహుమతుల ప్రధానోత్సవంలో సీఆర్‌సీ కాటన్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ల భరణి, సినీ నటుడు గౌతంరాజు, సీఆర్‌సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. నాటిక పోటీల్లో విజేతలకు తనికెళ్ల భరణి బహుమతులను అందజేశారు. ఈ ఏర్పాట్లను సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, నాటక కళా పరిషత్ డైరెక్టర్ కె.సూర్య, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ త్రిమూర్తులు, డైరెక్టర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి (చిన్నబుజ్జి), మల్లిడి అంజనీకుమార్‌రెడ్డి, మల్లిడి విజయభాస్కరరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, దండు సూరిబాబురాజు, నడింపల్లి వెంకటసుబ్బరాజువర్మ, పడాల సత్యనారాయణరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రథమ ప్రదర్శనగా విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెన వేలు నాటిక నిలిచింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం వారి అసత్యం నాటిక, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి అమ్మచెక్కిన బొమ్మ నాటికలు నిలిచాయి. ప్రథమ బహుమతిగా రూ. లక్ష, ద్వితీయ స్థానానికి రూ.75 వేలు, తృతీయ స్థానానికి రూ. 50 వేలు, షీల్డ్స్ అందించారు. ఉత్తమ దర్శకత్వం అసత్యం నాటికకు పి.బాలాజీనాయక్, ఉత్తమ రచన అమ్మచెక్కిన బొమ్మ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి, ఉత్తమ నటన తృతీయ స్థానం దొందూదొందే నాటిక సుబ్బారావు పాత్రధారి ఎస్.డేవిడ్‌రాజు, ఉత్తమ నటన ద్వితీయ స్థానం సహన నాటిక సహన పాత్రధారిణి జీఎన్‌డీ కుసుమసాయి, ఉత్తమ నటన చిటికెన వేలు నాటిక సోమన్న పాత్రధారి కె.సత్యనారాయణ, ఉత్తమ ఆహార్యం కన్నీటికి విలువెంత నాటిక కె.నాగేశ్వరరావు, ఉత్తమ సంగీతం అసత్యం నాటిక పి.లీలామోహన్, ఉత్తమ రంగాలంకరణ చిటికెన వేలు నాటిక ఎస్ రమణలు దక్కించుకున్నారు. అలాగే రెండు ప్రత్యేక బహుమతులు అమ్మచెక్కిన బొమ్మ నాటిక రెండో శివ పాత్రధారి భానుప్రకాష్, ఆచమనం నాటికలోని కృష్ణ పాత్రధారి బి.వెంకన్నబాబు దక్కించుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా పి.గోవిందరావు, గోపరాజు విజయ్ వ్యవహరించారు.


