అమలాపురం రూరల్: హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఐదో ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ (మెన్ – ఉమెన్) పోటీలు ఆదివారం ఉత్కంఠగా జరిగాయి. అమలాపురం ఈదరపల్లిలోని జనహిత కార్యాలయంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ పోటీలను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెట్ల రమణబాబు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ స్ట్రాంగ్ ఉమెన్‌గా ఏలూరి చెందిన శరణ్ ప్రథమ, అమలాపురం చెందిన పి.వందన ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆయా విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. విజేతలకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావులు బహుమతులు అందించారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా టీమ్‌ను ఎంపిక చేస్తామని ఆర్గనైజర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్, ఆశెట్టి ఆదిబాబు, మండేల బాబీ, గారపాటి చంద్రశేఖర్, పప్పుల శ్రీరామచంద్రమూర్తి, పెద్దిరెడ్డి రాము, గోకరకొండ సూరిబాబు, ముత్తాబత్తుల వెంకటరమణ, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


