● మాట కలిస్తే చాలు.. పెళ్లి ముహూర్తాలు
● గోదావరికి వచ్చే ఏడాది పుష్కరాలు
● ఆ సమయంలో ఏడాది పాటు పెళ్లిళ్లకు బ్రేక్
● ఇప్పుడు పెళ్లిళ్లకు తొందర
● ఈ నెలలో భారీగా వివాహాలు
సాక్షి, అమలాపురం: గోదావరిలో పుష్కరుడు ప్రవేశించడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. పుష్కరుడి రాక కోసం గోదావరి జిల్లా వాసులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యంగానైనా కళ్లు తెరచి పుష్కర సన్నాహాలకు నెమ్మదిగానైనా సిద్ధమవుతోంది. కానీ ఏడాది ముందుగానే పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. పుష్కరాలు జరిగే ఏడాది కాలం పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల వాసులు పెళ్లిళ్లకు దూరంగా ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ఈ కారణంగానే తమ పిల్లలకు ఈ ఏడాది చివరి నాటికి ఎట్టి పరిస్థితులలోను పెళ్లిళ్లు చేయాలని ఆతృత చూపుతున్నారు.
గోదావరి పుష్కరాల సమయంలో నది పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు పెళ్లిళ్లు చేయరాదని నమ్మే వారు.. పెళ్లికి ఎదిగిన తమ బిడ్డలకు ఈలోగానే సంబంధం కుదిరి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. దీనితో కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు వివాహం చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ వరకు పలు వివాహ ముహూర్తాలు ఉన్నా ఇప్పుడు మాట కలిస్తే చాలు ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. పుష్కరాలకు నెల రోజుల ముందు నుంచి అంత్య పుష్కరాల వరకు వివాహాలు చేయరు. గోదావరి జిల్లా వాసులలో చనిపోయిన పితృ దేవతలకు పుష్కర సమయంలో రాజమహేంద్రంలోని అఖండ గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన సప్త నదీపాయల వద్ద పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశ దానాలు చేస్తారు. కాబట్టి పరీవాహక ప్రాంతంలో ఏడాదిపాటు శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మంది పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. వచ్చే ఏడాది శూన్యమాసం తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు మిగిలిన రాయలసీమ జిల్లాలకు ఈ ప్రాంత వాసులు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశముంది. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఉభయ గోదావరి జిల్లా వాసులు పుష్కరాలకు ముందే పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నారు.
పుష్కరాల సమయంలో చాలా తక్కువ మంది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేస్తుంటారు. కాని ఇది శాస్త్ర విరుద్ధంగా భావించేవారు పుష్కరాల ఏడాది సమయం పెళ్ళిళ్లకు దూరంగా ఉంటారు. ఈ నమ్మకం కారణంగానే తమ పిల్లల పెళ్లిళ్ల కోసం బంధువులు, మిత్రులను, మ్యారేజ్ బ్యూరోల వారిని, ఆన్‌లైన్ వివాహ వేదికల వారిని సంద్రించేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముహూర్తాలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఎందుకై నా మంచిది కుదిరితే చాలు వివాహం చేసేద్దామనే వారు కూడా ఉన్నారు. పుష్కరాల సమయంలో ఏడాది పాటు వివాహాలు చేయడంపై పరస్పర విరుద్ధమైన వాదనలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా.. ఎందుకై నా మంచిది అని ఈ ఏడాది పెళ్లిళ్లు చేసేద్దాం అనేవారు ఎక్కువగా ఉన్నారు.
ముహూర్తాలు తక్కువే
ప్రస్తుతం ఈ నెల ఐదు, ఆరు, ఏడు తేదీలలో వివాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇదే నెలలో మరికొన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌తో పాటు మే 18 వరకు వివాహాలు నిర్వహించేందుకు అనువైన కాలం. మే 19 నుంచి జూన్ 16వ తేదీ వరకు అధిక జ్యేష్ట మాసం కారణంగా శుభ ముహూర్తాలు లేవు. జూన్ 17 నుంచి జూలై 9 వరకు తిరిగి ముహూర్తాలు ఉండగా, జూలై 14 నుంచి ఆగస్టు 13 వరకు గురు మౌఢ్యమి, ఆషాఢ మాసం వస్తోంది. ఈ సమయంలో వివాహాలు చేయరు. కొత్త అల్లుళ్లను అత్తవారి ఇళ్లకు రానివ్వరు. తిరిగి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 వరకు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండగా, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు భాద్రపద మాసం కారణంగా ముహూర్తాలు లేవు. అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 9 వరకు ఆశ్వయుజ మాసంలో ముహూర్తాలు ఉండగా, అక్టోబర్ 19 నుంచి 29 వరకు శుక్ర మౌఢ్యమి కారణంగా వివాహాలు జరగవు. తిరిగి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు కార్తికమాసం, డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు శూన్యమాసం పెళ్లిళ్లు చేయరు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు మాఘమాసం, మార్చి 9 నుంచి ఏప్రిల్ 6 వరకు ఫాల్గుణ మాసంలో పెళ్లిళ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఉగాది తరువాత మే నెల వరకు ముహూర్తాలు ఉన్నాయి. అంటే ఇంచుమించు ఏడాది మీద రెండు నెలల సమయం ఉంది. అయినా తల్లిదండ్రులు పెళ్లిళ్లకు హడావుడి పడుతున్నారు.
శాస్త్ర ప్రకారం ఏడాది విరామం
హిందూ శాస్త్ర ప్రకారం పుష్కరాల సమయంలో ఏడాది కాలం పాటు పెళ్లిళ్లు చేయకూడదు. పుష్కరాలు మొదలయ్యే నెల ముందు నుంచి అంత్య పుష్కరాల వరకు పెళ్లిళ్లు చేయరు. కొంతమంది కృష్ణా తీరంలో వివాహాలు జరిపిస్తుంటారు. కాని ఇది శాస్త్ర విరుద్ధం. అందుకే ఈ ఏడాది సాధ్యమైనంత వరకు పెళ్లిళ్ల్లు చేయాలని తల్లిదండ్రులు ఆతృత పడుతున్నారు.
– ఉపద్రష్ట నాగాదిత్య,
దైవజ్ఞ రత్న, పంచాంగకర్త, అమలాపురం


