పులిని పట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పులిని పట్టుకోవాలి

Mar 3 2026 8:21 AM | Updated on Mar 3 2026 8:21 AM

రంపచోడవరంలో గిరిజనుల ర్యాలీ

రంపచోడవరం: ఆదివాసీలకు జీవనధారమైన పంటలు, పశువులు, మేకలకు పులులు, వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వర్యాన గిరిజనులు సోమవారం రంపచోడవరంలో ర్యాలీ నిర్వహించారు. పాపికొండలు నేషనల్‌ పార్కు ఎకో సెన్సిటివ్‌ జోన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌ మాట్లాడుతూ, మైదాన ప్రాంతానికి వచ్చిన పెద్ద పులిని రూ.కోట్లు ఖర్చు చేసి పట్టుకుని రంపచోడవరం గండి పైన గిరిజనులు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో అటవీ అధికారులు వదిలి వెళ్లారని అన్నారు. ప్రస్తుతం పులి భయంతో ఎక్కడకూ వెళ్లలేని పరిస్థితిలో గిరిజనులున్నారని తెలిపారు. ఆదివాసీలు జాగ్రత్తగా ఉండాలంటూ గ్రామాల్లోకి వచ్చి చెబుతున్నారని, వన్యప్రాణులను చంపితే కఠినంగా శిక్షిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికారులపై గిరిజనులు తిరుగుబాటు చేయాలని అన్నారు. ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజనులనుద్దేశించి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడారు. ఏజెన్సీలో పులి సంచారంపై ఆందోళన చెందవద్దని అన్నారు. అటవీ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామన్నారు. పులికి జియో ట్యాగ్‌ ఉందని, దీని సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఉంటుందని, ఆయా గ్రామాల వారిని అప్రమత్తం చేస్తారని తెలిపారు. పులి సంచారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement