అల్లవరం: గోదావరి జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను సమగ్రంగా విశ్లేషించి, వాటి సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా చేసిన పరిశోధన ప్రాజెక్టుకు గాను అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో చోటు దక్కింది. ఆ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న అయ్యగారి నాగేశ్వరరావు, శ్రీపాద రామకృష్ణ, ఆకుల ప్రవీణ్‌లు చేసిన ‘గోదావరి జిల్లాల వైదిక వారసత్వంపై విశ్లేషణాత్మక అధ్యయనం’ ప్రాజెక్టుకు గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందని బీవీసీ చైర్ పర్సన్ బోనం కనకదుర్గ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో గోదావరి జిల్లాల వైదిక వారసత్వం మేటిగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ కళాశాల విద్యా పరిశోధన రంగాల్లో మైలురాయిని అధిగమించిందని ప్రిన్సిపాల్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.
నేడు చంద్ర గ్రహణం
వీరేశ్వరస్వామి ఆలయం మూసివేత
ఐ.పోలవరం: ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి జరిగే భక్తుల కల్యాణాలు రద్దు చేసినట్లు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. దేవస్థానం అనుసరించే పంచాంగం ప్రకారం ఆలయ అర్చకులు, పురోహితుల సూచనల మేరకు ఉదయం జరగాల్సిన అభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం తదితర పూజలు జరిపించి ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. సాయంత్రం 6.09 నుంచి 6.48 వరకూ గ్రహణ మోక్ష కాలం ఉంటుందన్నారు. అనంతరం ఆలయ మహా సంప్రోక్షణ, అభిషేకం, మహానివేదన, ధూప సేవ చేసి అనంతరం స్వామివారికి అర్చకులచే ఏకాంతంగా నిత్య కల్యాణం నిర్వహిస్తామని వివరించారు. ఈ సమయంలో భక్తుల దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా భక్తుల దర్శనాలు, అభిషేకాలు ఉంటాయన్నారు.


