కుట్ర పూరితంగానే ప్రభుత్వానికి సరెండర్
కలెక్టర్‌పై డీఆర్‌డీఏ పీడీ ఆరోపణ
అమలాపురం రూరల్: తనను కలెక్టర్ అకారణంగా, కుట్ర పూరితంగా ప్రభుత్వానికి సరెండర్ చేశారని డీఆర్‌డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర గాంధీ ఆరోపించారు. సెర్ఫ్ సీఈఓ అనుమతితో సెలవుపై వెళితే తనకు షోకాజ్ నోటీసు లేకుండా కలెక్టర్ సరెండర్ ఉత్తర్వులు ఇచ్చారని పీడీ వాపోయారు. ఆదివారం అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఆ సరెండర్ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ సంఘాలతో కలసి ఉద్యమం చేస్తారని అన్నారు. తాను కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నా రావడం లేదనే కారణం చూపుతూ, డీఆర్వో మాధవి సంతకంతో ప్రభుత్వానికి సరెండర్ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని అన్నారు. తాను గిరిజన కులానికి చెందిన వ్యక్తిని కావడంతోనే అన్యాయం చేశారన్నారు. జిల్లాలో పది నెలల కాలంలో మహిళా సంఘాల, బ్యాంకు లింకేజీ సీ్త్రనిధి నిధులు దుర్వినియోగంపై 18 మంది వీఓలను తొలగించి రూ. 64.69 లక్షలను తాను రికవరీ చేశానని చెప్పారు. తనకు కలెక్టర్ అంటే ఎంతో గౌరవమని అన్నారు. ఈ ఆరోపణలపై డీఆర్వో మాధవిని ‘సాక్షి’ వివరణ కోరగా పీడీ సమావేశాలకు హాజరు కాకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా సెలవు పెట్టి వెళ్లి ఏపీడీకి ఇన్‌చార్చి అప్పగించారని అన్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా తిరిగి పీడీగా చార్జి తీసుకున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వానికి కలెక్టర్ ఆదేశాలతో సరెండ్ చేసినట్లు వివరించారు.


