మంచి నారుమడి.. అధిక దిగుబడి
● ఆరోగ్యవంతమైన
నారుమడిపై దృష్టి పెట్టాలి
● రబీ రైతులకు ఏరువాక
కో ఆర్డినేటర్ నంద కిషోర్ సూచనలు
ఐ.పోలవరం: రబీ రైతులు ఆరోగ్యవంతమైన నారుమడిపై దృష్టి పెట్టాలని, అప్పుడే అధిక దిగుబడి సాధించే అవకాశముందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నంద కిషోర్ అన్నారు. ప్రస్తుతం డెల్టాలో రైతులు రబీ సాగుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో నారుమడులు మొదలయ్యాయి. మరో వారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నారుముడులు వేయనున్నారు. ఈ సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నంద కిషోర్ తెలిపారు. అవి ఆయన మాటల్లోనే...
చురకుగా నారుమడులు
జిల్లాలో ప్రస్తుతం కొందదదరు రైతులు నారుమడులు పోసుకునే దశలో ఉన్నారు. ఆలమూరు, కొత్తపేట, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో చాలా మంది ఇప్పటికే వీటిని వేశారు. రబీ పంట కాలంలో ఆరోగ్యవంతమైన నారును పెంచటానికి పలు యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంది. తడులు అందించడంతో పాటు సకాలంలో ఎరువులు, ముందుల పిచికారీ చేయాలి. ఈ కింద సూచించిన, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపటాలి.
ఎరువుల యాజమాన్యం
ఐదు సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని అంటే సుమారు 5 కిలోల యూరియా ఇవ్వాలి. విత్తనం చల్లే ముందు 2.5 కిలోలు, విత్తనం చల్లిన 10 నుంచి 15 రోజులకు మరొక 2.5 కిలోలు వేయాలి. ఒక కిలో భాస్వరం అంటే 6 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, ఒక కిలో పొటాన్ అంటే 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి.
ఫ జిల్లాలో రబీ పంట కాలంలో జింక్ థాతు లోపం ఎక్కువగా వస్తుంది. దీనిని సకాలంలో గుర్తించి నివారణ కోసం జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి చొప్పున కలిపి వరి పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
సస్యరక్షణ
నారుమడిలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణకు విత్తన 10 రోజులకు కార్బొప్యురాన్ 3 జీ గుళికలు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల చొప్పున అందించాలి. ఆ సమయంలో నారుమడిలో పలుచగా నీరు ఉంచి చల్లాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2. మీ.లీ.. లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు ఒకసారి, తిరిగి 17 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బొప్యురాన్ 3 జి గుళికలు ఇసుకలో కలిపి నారుమడిలో పలుచగా నీరు ఉంచి చల్లాలి.
కలుపు నివారణ
నారుమడిలో గడ్డి జాతి కలుపు నివారణకు పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ 10 శాతం డబ్ల్యూపి.80 గ్రాములు, లేదా ప్రేటిలాక్లోర్‌లో సెఫ్నర్ 400 మీ.లీ కలిపి ఒక ఎకరానికి చొప్పున 20 కిలోల పొడి ఇసుకలో కలిపి విత్తిన 3 నుంచి రోజుల లోపు చల్లాలి. నారుమడిలో గడ్డి జాతి, వెడల్పాకు కలుపు నివారణకు బిస్ పైరీబాక్ సోడియం 10 శాతం ఎస్‌ఎల్ 100 మీ.లీ.. ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15 నుంచి 20 రోజులకు చల్లాలి. ఇలా చేయడం ద్వారా రైతులు ఆరోగ్యవంతమైన నారుమడిని, రబీలో మంచి దిగుబడిని సాధించవచ్చు.


