ఓడలరేవు తీరానికి రక్షణ వలయం
● ఆరు కిలోమీటర్ల పొడవునా
గ్రోయన్ల నిర్మాణం
● ఓఎన్‌జీసీ నిధులతో
కొనసాగుతున్న పనులు
అల్లవరం: ఓడలరేవు తీరానికి రక్షణ వలయం ఏర్పడుతోంది. ఆరు కిలోమీటర్ల పొడవున 300 మీటర్ల నిడివితో గ్రోయన్ల నిర్మాణం జరుగుతోంది. వీటికి ఓఎన్‌జీసీ రూ.139 కోట్ల నిధులు మంజూరు చేయగా, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా రెండు దశాబ్ధాలుగా ఓడలరేవు తీరంలో వందల ఎకరాల విస్తీర్ణంలో తీరం కోతకు గురైంది. భారీ తుపాన్లు, సునామీల ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చి, మానవ జీవనానికి ప్రతిబంధకంగా మారింది. తీరానికి రక్షణ వ్యవస్థగా ఉన్న తాటిచెట్లు, సరుగుడు తోటలను భారీ కెరటాలు సముద్రంలో తీసుకుపోయాయి. దీంతో బలమైన వేరు వ్యవస్థ కోల్పోయి తీరం తరుగుతూపోతోంది. దీంతో సముద్రం ముందుకు రావడంతో ఓడలరేవులో చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్‌జీసీ పెద్ద ప్రమాదంలో పడింది.
ప్రతిపాదనలకు కార్యరూపం
ఓడలరేవు తీరానికి రక్షణ గోడ నిర్మించి గ్రామంతో పాటుగా ఓఎన్‌జీసీ టెర్మినల్‌ను కాపాడుకునేందుకు పదేళ్ల క్రితం రూ.130 కోట్లతో ప్రతిపాదనలు చేయగా నేటికి కార్యరూపం దాల్చింది. ఓడలరేవు నదీ సంగమం నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకు సుమారు 6 కిలోమీటర్ల పొడవునా గ్రోయన్స్ నిర్మాణం చేసేందుకు ఓఎన్‌జీసీ రూ.139 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత నెల ఒకటో తేదీ నుంచి తీరంలో ఈ పనులను శాంతి ఇన్‌ఫాస్ట్రక్చర్ కంపెనీ చేపట్టింది. ప్రతి మూడు వందల మీట్లర్ల నిడివితో 150, 100, 50 మీటర్ల పొడవునా తీరం నుంచి సముద్రంలోకి సుమారు 100 అడుగుల వెడల్పున ఓఎన్‌జీసీ పశ్చిమ ప్రహరీని ఆనుకుని గ్రోయన్ల నిర్మాణం చేస్తున్నారు. రు. ప్రస్తుతం రెండు గ్రోయన్లకు సంబంధించి బ్లాక్ స్టోన్‌ను సముద్రంలో వేస్తున్నారు. వీటికి మరింత రక్షణగా నాలుగు ముఖాలు కలిగిన సుమారు టన్ను బరువు ఉండే టెట్రాపాడ్లు ఏర్పాటు చేయనున్నారని పని ప్రదేశంలో ఓ అధికారి తెలిపారు. టెట్రాపాడ్ల వల్ల కెరటాలు విచ్ఛిన్నమై తీరం కోతకు గురి కాకుండా ఉంటుంది. అయితే ఈ పని పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.
ఓడలరేవు తీరానికి రక్షణ వలయం


