యువకుడిపై కత్తితో దాడి
● మరొకరికి గాయాలు
● పాత గొడవలతో గంటిలో ఘటన
కొత్తపేట: పాత గొడవల నేపథథ్యంలో ఒక వర్గానికి చెందిన యువకుడిపై మరో వర్గానికి చెందిన యువకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన కర్రి మణికంఠ మోటార్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళుతూ గంటి సెంటర్‌లో తన స్నేహితుడు కర్రి సత్యసాయి నాగదుర్గారావుతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన విశాల్ తన స్నేహితులతో వచ్చి ఘర్షణ పడి, కత్తితో దాడి చేశాడు. ఘర్షణలో మణికంఠను కత్తితో పొట్టపై పొడవగా పేగులు బయటకు వచ్చి తీవ్రంగా గాయపడ్డాడు. దుర్గారావుకు మోకాలిపై గాయమైంది. వారిద్దరినీ కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మణికంఠకు ప్రాథమిక చికిత్స జరిపి ఉన్నత వైద్యం నిమిత్తం రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్ర చికిత్స చేస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు పాత గొడవలే కారణమని, దానిలో భాగంగా ఈ నెల 31 రాత్రి కూడా ఘర్షణ పడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసు అధికారులు ఈ దాడిపై ఆరా తీశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేయాల్సి ఉంది.


