కలెక్టర్‌కు పలువురి శుభాకాంక్షలు
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ను ఎస్పీ రాహుల్ మీనా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ కొత్త సంవత్సరం ఆరోగ్యం, ఆనందం, విజయాలతో నిండాలని కోరుకుంటున్నానన్నారు. నూతన సంవత్సరం అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభ్యున్నతిని తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆకాంక్షించారు. గురువారం ఆమె చాంబర్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
3న అంతర్వేది
రథ శకలాల నిమజ్జనం
సఖినేటిపల్లి: అంతర్వేది రథ శకలాలను ఈ నెల 3వ తేదీన సాగర సంగమం వద్ద నిమజ్జనం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పోలీసు శాఖ అనుమతితో ఎండోమెంట్స్ పర్యవేక్షణలో అర్చకుల, ఆగమ పండితుల సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ రోజు ఉదయం వైదిక కార్యక్రమాలతో పూజల అనంతరం రథ శకలాలను ముక్కలుగా చేస్తామన్నారు. వాటిని ట్రాక్టర్ల ద్వారా సాగర సంగమం ప్రాంతానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం కర్పూరంతో భస్మీపటలం చేస్తామన్నారు. భస్మం చల్లారిన తరువాత బోటు ద్వారా నదీ మధ్యలోకి తీసుకు వెళ్లి నిమజ్జనం చేస్తామన్నారు.


