● అతడి భార్యకు తీవ్రగాయాలు
● విజయవాడ నుంచి ఇచ్ఛాపురం
వెళ్తుండగా ఘటన
ప్రత్తిపాడు: మండలం ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయ పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దిపుట్టి గ్రామానికి చెందిన పిట్టా వసంతకుమార్ (32) విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామం వెళ్లేందుకు తన భార్య సంధ్యతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. అరకు లోయ వెళ్లి, అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకువెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్‌ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షకై స్థానిక సీహెచ్‌సీ తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి