
పరిహారం ప్రకటించకపోవడం విచారకరం
రాయవరం: రాయవరం శ్రీగణపతి ఫైర్ వర్క్స్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత పరిశీలించినా ఇప్పటివరకూ బాధితులకు పరిహారం ప్రకటించకపోవడం విచారకరమని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్‌టీయూ నాయకులు చింతా తదితరులు అన్నారు. శనివారం ప్రమాదంలో మృతి చెందిన అనపర్తి సావరానికి చెందిన కురిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, అనపర్తికి చెందిన చిట్టూరి శ్యామల, సోమేశ్వరానికి పాకా అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, కొమరిపాలేనికి చెందిన పొట్నూరి వెంకటరమణ తదితర బాధిత కుటుంబాలను ప్రజా సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని, వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని శాఖలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. నాయకులు వానపల్లి నాగరాజు, బాధిత కుటుంబాలు పాకా సుబ్బారావు, పాకా ప్రభాస్, వాసంశెట్టి వెంకటరమణ, పొట్నూరి సాయిసురేష్, వి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.