
శిక్షణ ముగిసింది.. చేరికే మిగిలింది
ఫ కొత్త గురువులకు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి
ఫ 13న కొలువుల్లో చేరనున్న టీచర్లు
రాయవరం: వారంతా ఎంతో శ్రమించారు.. పుస్తకాలతో కుస్తీ పట్టారు.. చివరికి కొలువులు సాధించారు.. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొందరు.. గురువుల ప్రోత్సాహంతో ఇంకొందరు.. అన్నదమ్ముల ఆదర్శంతో మరికొందరు.. పుట్టిల్లు, మెట్టింటి వారి సహకారంతో.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ.. పట్టుదలతో చదివి డీఎస్సీలో విజయం సాధించారు. కొత్తగా కొలువు సాధించిన ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ కూడా పూర్తయ్యింది. ఇక కొలువుల్లో చేరడమే తరువాయి. డీఎస్సీ–2025లోఎంపికై న నూతన ఉపాధ్యాయులకు ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు వెన్యూస్‌లో ఆయా సబ్జెక్టుల వారీగా ఇచ్చిన శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఇందులో భాగంగా వృత్తిలో పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలను వివరించారు. విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధి విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. నిపుణ్ భారత్ లక్ష్యాలు, విద్యా, బాలల హక్కులు, పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, మూల్యాంకన విధానాలు, లీప్ యాప్, డిజిటల్ టూల్స్, ఐఎఫ్‌పీలను ఉపయోగించడం, టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలను పరిచయం చేయడం, వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం తదితర అంశాలపై ఎనిమిది రోజుల శిక్షణ ఇచ్చారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 1,668 మంది ట్రైనింగ్ పొందాల్సి ఉండగా, 1,659 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో తొమ్మిది మంది హాజరు కాలేదు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 524 మందికి 524, సోషల్ సబ్జెక్టు 131 మందికి 130 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 210 మందికి 210, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి 230 మందికి 227 మంది, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి 244 మందికి 244 మంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 329 మందికి 324 మంది హాజరయ్యారు.
బదిలీ ఉపాధ్యాయులకు మోక్షం
అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు కోరుకున్న స్థానాల్లో నేటికీ చేరలేదు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో బదిలీ జరిగిన ఉపాధ్యాయులనే వెనక్కి పంపించిన అధికారులు పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుల చేరికతో బదిలీ అయ్యి రిలీవ్ కాలేని ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించనుంది.
సమర్థవంతంగా శిక్షణ
డీఎస్సీ–2025 ఉపాధ్యాయులకు నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాం. ఎక్కడా ఏ విధమైన లోటుపాట్లకు తావులేకుండా శిక్షణ ఇచ్చాం. నూతన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో శిక్షణ తీసుకున్నారు.
–డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
వెబ్ ఆప్షన్లు పూర్తి
కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయ్యింది. పోస్టింగ్ ఆర్డర్లు జనరేట్ అయిన తర్వాత ఈ నెల 13న విధుల్లో చేరా ల్సి ఉంటుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
నేడు పోస్టింగ్ ఆర్డర్లు
శిక్షణలో భాగంగా గురు, శుక్రవారాల్లో ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేనేజ్‌మెంట్ల వారీగా ఖాళీలను ప్రకటించారు. వెబ్ లింక్ ద్వారా ఉపాధ్యాయులు వారికి కావాల్సిన పోస్టులను ఎంపిక చేసుకున్నారు.
శనివారం ఉపాధ్యాయులకు వారు ఎంచుకున్న స్థానాలను కేటాయిస్తూ పోస్టింగ్ ఆర్డర్లు జనరేట్ అయ్యే అవకాశముంది. వారికి కేటాయించిన స్థానాల ప్రకారం ఈ నెల 13న ఉపాధ్యాయ కొలువుల్లో చేరనున్నారు.