
అదివో.. అల్లదివో..
ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక పరిమళాలు
ఫ బ్రహ్మాండ నాయకునికి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఫ తొలిరోజు పరావాసుదేవ
అలంకరణలో స్వామివారు
కొత్తపేట: కోనసీమ వెంకన్నగా.. ఏడు వారాల స్వామిగా.. పూజలందుకుంటున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభువుగా వేంచేసిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ బహుళ చవితి శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు ఆ స్వామిని చూసిన భక్తజనం మురిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని కొలిచారు. శేష వాహనంపై శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ప్రాంగణం, మాడ వీధులు రంగు రంగుల పూలమాలలు, విద్యుత్ అలంకరణలతో కనువిందు చేసింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహన సేవ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారు జామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తీర్థ బిందెలతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్ర నామాలతో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9.35 గంటల నుంచి స్వామివారికి స్వస్తి వచనం, పుణ్యహ వాచనం, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, విశేషార్చన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్యుంగ్రహణ, శాలా విహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున ఈఓ చక్రధరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
శేషవాహనంపై శ్రీవారి విహారం
బ్రహ్మోత్సవాలు ప్రారంభ వేళ స్వామివారు పరావాసుదేవగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు శేషవాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్శంగా పండితులు శేష వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ స్వామి శేష పాన్పుపై ఉంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రథమ వాహనం శేష వాహనం అని, ఈ వాహనంపై స్వామివారిని దర్శిస్తే వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శించిన ఫలితం లభిస్తుందని వివరించారు. ఆ విధంగా స్వామివారిని దర్శించిన భక్తులు ఆనంద డోలికల్లో తేలియాడారు. తొలిరోజు కార్యక్రమాల్లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని ఈఓ చక్రధరరావు సత్కరించి, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. పలువురు ప్రముఖులు, నాయకులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీసు బందోబస్తు నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు ఇలా..
వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం మహా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, రాత్రి సరస్వతి అలంకరణతో హంస వాహనసేవ ఉంటుంది.

అదివో.. అల్లదివో..

అదివో.. అల్లదివో..