ఏడాదిలో శత వసంతం.. అంతలోనే ఇంత విషాదం | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలో శత వసంతం.. అంతలోనే ఇంత విషాదం

Oct 12 2025 6:51 AM | Updated on Oct 12 2025 6:51 AM

ఏడాది

ఏడాదిలో శత వసంతం.. అంతలోనే ఇంత విషాదం

రాయవరం: మరో ఏడాది గడిస్తే శత వసంతాల వేడుకలు జరుపుకొనే ఆలోచనలో ఉన్నారు. ఆ వేడుక అనంతరం వ్యాపారాన్ని విరమించుకునే ప్రయత్నంలో ఉండగానే విధి చిన్నచూపు చూసింది. రాయవరంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో శ్రీగణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం పాఠకులకు విదితమే. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన వెలుగుబంట్ల వీరన్న 1926లో శ్రీగణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌ ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం తొలుత ఏడాదికి పర్మిషన్‌ ఇచ్చింది. అప్పట్లో కలెక్టర్‌ వచ్చి ఏటా పరిశీలించిన అనంతరం బ్రిటిష్‌ ప్రభుత్వానికి రికమెండ్‌ చేసినట్లుగా తాత నారాయణమూర్తి (వీరన్న కుమారుడు) కుమారుడు శేషగిరి తెలిపారు. తాత నారాయణమూర్తి చైనా వెళ్లి ఆరేళ్ల పాటు నేర్చుకున్న అనంతరం బాణసంచా తయారీలో సర్టిఫికెట్‌ పొందారు. చైనా వెళ్లి అక్కడ బాణసంచా తయారీని పరిశీలించి వ్యాపారం ప్రారంభించినట్లు చెబుతారు. 1936లో పర్మినెంట్‌ లైసెన్స్‌ పొందిన అనంతరం తయారీని విస్తరించినట్లు తెలుస్తోంది. వీరన్న బాణసంచా పరిశ్రమ స్థాపించినప్పటికీ ఆయన కుమారులు తాతనారాయణమూర్తి, రామకృష్ణ పరిశ్రమను అభివృద్ధి చేశారు. దక్షిణ భారతదేశంలోనే హ్యాండ్‌ మేడ్‌ బాణసంచా తయారీ ప్రారంభించినట్లు చెబుతారు. అప్పట్లో చిచ్చుబుడ్లు, మతాబులు, తారాజువ్వలు తప్ప మిగిలిన తయారీ ఉండేది కాదు. వీరి హయాంలో బాణసంచాలో ఆధునిక పద్ధతులు జోడించారు. మల్లెపందిరి, నాగసర్పం, ఈతచెట్టు, సూర్య, చంద్ర చక్రాలు, గ్లోబు, చైనా రింగు వంటి వివిధ రకాల ఆకృతుల్లో బాణసంచా తయారీ చేసి అందరి మన్ననలు పొందారు. వీరు ఇన్నోవేటివ్‌గా కొన్ని ఆకృతుల్లో బాణసంచా తయారు చేసి ఆకట్టుకునే వారు. అనంతరం తాతనారాయణమూర్తి కుమారుడు సత్తిబాబు పరిశ్రమను మరింత విస్తరించి రాష్ట్ర స్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాల్లో బాణసంచా కాల్చడంతో పరిశ్రమకు గుర్తింపును తీసుకు వచ్చారు. ఇదిలా ఉంటే 2026లో శత వసంతాల వేడుక నిర్వహించాలని భావించారు. వెలుగుబంట్ల కుటుంబం బాణసంచా తయారీని స్థాపించి వందేళ్లయిన సందర్భంగా వేడుక నిర్వహించిన అనంతరం తయారీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. కాగా అంతలోనే ఇంత పెను ప్రమాదం సంభవించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారిని కదిలిస్తే కన్నీళ్లు మాత్రమే సమాధానమవుతోంది.

గోమాత మూగరోదన

బాణసంచా ప్రమాదం మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 8న రాయవరంలో చోటు చేసుకున్న బాణసంచా దుర్ఘటనలో ఎనిమిది మృతి చెందగా, మరో ఇరువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇదే ప్రమాదంలో గాయపడిన గోమాత మూగరోదన చూపరులను కలచివేస్తోంది. బాణసంచా కేంద్రం వద్ద యజమాని పుంగనూరు జాతి గోమాతను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇటీవలే లేగదూడకు జన్మనిచ్చిన గోమాతను యజమాని సత్తిబాబు కన్నబిడ్డల్లా సాకేవారు. ఊహించని ప్రమాదంలో మూగజీవాలు కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. కట్టురాడుకు కట్టి ఉన్న మూగజీవాలను స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదంలో ఒక పక్క లేగదూడను కోల్పోయి, మరో పక్క శరీరం కాలిపోయిన స్థితిలో ఉన్న గోమాతను కొవ్వూరి బులిరెడ్డి రాయవరం పశు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం శరీరమంతా కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ ఆవుకు ఏరియా పశు వైద్యశాల డాక్టర్‌ అనిత ఆధ్వర్యంలో సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు కాగా, ఆవు శరీరానికి ఆయింట్‌మెంట్లు రాస్తూ.. అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నారు. రాత్రి సమయంలో దోమతెరల సాయంతో కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రస్తుతం గోమాత ఆహారాన్ని తీసుకునే స్థితిలో లేకపోవడంతో ఫ్లూయిడ్స్‌ సైలెన్ల రూపంలో ఎక్కిస్తున్నారు.

ఏడాదిలో శత వసంతం.. అంతలోనే ఇంత విషాదం1
1/1

ఏడాదిలో శత వసంతం.. అంతలోనే ఇంత విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement