వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం

Oct 11 2025 9:36 AM | Updated on Oct 11 2025 9:36 AM

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం

ప్రభుత్వ తీరును నిరసిస్తూ

కోటి సంతకాల సేకరణ ఉద్యమం

వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల

రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కన్నబాబు

కాకినాడ రూరల్‌: బృహత్తర బాధ్యతగా, తరతరాలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రు ల నిర్మాణాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు కు అప్పగించాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్య నగర్‌లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 12 మెడికల్‌ కాలేజీలుంటే జగన్‌మోహన్‌రెడ్డి 17 కాలేజీల నిర్మాణానికి సంకల్పించారన్నారు. వీటిల్లో 5 కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించగా, మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా, 10 కళాశాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పా రు. ఈలోగా ప్రభుత్వం మారడంతో కార్పొరేట్ల పక్షాన నిలిచే చంద్రబాబు వీటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పేదల పక్షాన నిలిచే జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ముందుకు వెళ్తున్నారన్నా రు. ఇందులో భాగంగా ఉద్యమ నిర్మాణం చేపడుతూ, కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారని చెప్పారు.

జగన్‌ పర్యటనకు ప్రభం‘జనం’ : పోలీసుల ద్వారా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా నర్సీపట్నం వద్ద మెడికల్‌ కాలేజీ సందర్శనకు గురువారం వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ప్రభంజనాన్ని తలపించేలా అన్ని వర్గాల ప్రజలూ తరలివచ్చారని కన్నబాబు అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జగన్‌ పర్యటనలో దారి పొడవునా ప్రజల నుంచి వచ్చిన వినతులు చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంటును దశల వారీగా మూసివేసే కార్యక్రమం చేపడుతున్నారని, బల్క్‌ డ్రగ్‌ ఫ్యాక్టరీలు వద్దంటూ మత్స్యకారులు నిరసనలు తెలియజేస్తుంటే అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు నిరసన తెలియజేస్తున్నారన్నారు. కేజీహెచ్‌లో 65 మంది గిరిజన విద్యార్థులు కామెర్లతో చికిత్స పొందుతున్నారని, పార్వతీపురం ఆస్పత్రిలో 80 మంది.. ఇలా 600 మంది గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో 200 మంది వరకూ అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మలమూత్రాలు కలసిన నీరు తాగాల్సిన పరిస్థితి హాస్టల్‌ విద్యార్థులకు ఉందంటే ఎవరు తలదించుకోవాలని చంద్రబాబును కన్నబాబు ప్రశ్నించారు.

ప్రైవేట్‌కు దోచిపెట్టేందుకే.. : నర్సీపట్నంలో 52 ఎకరాల భూమిని కేటాయించి వైద్య కళాశాల కడుతూంటే ప్రైవేటుకు ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారని, పాడేరులో మెడికల్‌ కాలేజీ కట్టాలనే ఆలోచన 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఎందుకు రాలేదని కన్నబాబు నిలదీశారు. ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం తప్ప చంద్రబాబు చేసిందేముందన్నారు. మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు. కేజీహెచ్‌ వద్ద జగన్‌ పట్ల విశాఖ పోలీస్‌ కమిషనర్‌ అనుచితంగా మాట్లాడినట్టు జర్నలిస్టులు చెప్పారని, ఇది సముచితమేనా అని ప్రశ్నించారు. జగన్‌ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదని, మాజీ సీఎం అని, 2029లో కాబోయే సీఎం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరిని సంతోషపెట్టడానికి అధికారులు పని చేస్తున్నారని కన్నబాబు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement