
సహకార వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అఖిల భారత సహకార వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ఆకుల వీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో సహకార వారోత్సవాల పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో సహకార వారోత్సవాలను విధిగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలు, సహకార బ్యాంకులు ఇస్తున్న రుణాలు, రాయితీలపై అవగాహన కల్పించాలని సూచించారు. రామదాసు సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 14న ఉమ్మడి జిల్లాలోని అన్ని సహకార సంస్థల్లో సహకార పతాకాలు ఆవిష్కరించాలన్నారు. అదే రోజు కాకినాడ డీసీసీబీలో చైర్మన్ ఆకుల వీర్రాజు సహకార వారోత్సవాలు ప్రారంభిస్తారన్నారు.
ఉపాధి హామీ
పనుల్లో నాణ్యత
సామర్లకోట: ఉపాధి హామీ పనుల్లో మరింత నాణ్యత పెరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని డ్వామా అదనపు కమిషనర్ అశోక్‌కుమార్ అన్నారు. డ్వామా రాష్ట్ర స్థాయి రీసోర్సు పర్సన్లకు స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రంలో మూడు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధుల్లో 50 శాతం కేటాయించే ముఖ్యమైన పనులను గుర్తించాలన్నారు. అధికారులు తరచూ ఉపాధి పనులను పర్యవేక్షించాలని, మస్తర్లను పరిశీలించాలని అన్నారు.